10 Babies: ఒక్క కాన్పులో 10 మందికి జన్మనిచ్చిన మహిళ
Samsthi 2210 - June 9, 2021 / 02:32 PM IST

10 Babies: కలియుగంలో ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో అద్భుతాలు వింటున్నాం, చూస్తున్నాం. అప్పుడెప్పుడో కాలజ్ఞాని బ్రహ్మంగారు చెప్పినట్టే అద్భుతాలు ఒక్కొక్కటి జరుగుతూ వస్తున్నాయి. తాజాగా ఒక మహిళ ఒకే కాన్పులో పది మంది పిల్లలకు జన్మనిచ్చి అందరిని ఆశ్చర్యపరచింది. అంతేకాదు ఇది ప్రపంచ రికార్డ్ అని కూడా అంటున్నారు. ఈ సంఘటన ప్రస్తుతం అంతటా చర్చనీయాంశంగా మారింది.

Women Gave Birth to 10 Babies
వివరాలలోకి వెళితే దక్షిణాఫ్రికాకు చెందిన ఓ మహిళ గర్భంతో ఉండగా, ఆమె చెకప్ కోసం వైద్యుని దగ్గరకు వెళ్లింది. వారు తీసిన స్కానింగ్ రిపోర్ట్‌ని బట్టి మొదట ఆరుగురు పిల్లలు పుడతారని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత స్కానింగ్‌లో 8 మంది పిల్లలు పుడతారని వైద్యులు చెప్పుకొచ్చారు.
కాని రిపోర్ట్‌లను కూడా అధిగమించి ఒకే కాన్పులో పది మంది పిల్లలకు జన్మనిచ్చిన ఆ మహిళ అందరు నివ్వెర పోయేలా చేసింది. దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా అనే నగరానికి చెందిన గోసియమి తమారా సితోలే (37)కు జన్మించిన వారిలో ఏడుగురు మగ పిల్లలు ఉండగా, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.
సితోలే రిటైల్ స్టోరీ మేనేజర్‌గా పని చేస్తుండగా, గతంలో ఆమె ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. ఇప్పుడు వారి వయస్సు ఆరేళ్లు. మరో ప్రగ్రెన్సీలో ఏకంగా పది మంది పిల్లలకు జన్మనిచ్చింది. మే నెలలో మొరాకోకు చెందిన మహిళ తొమ్మిది మంది పిల్లలకు జన్మనివ్వగా, ఇది మొన్నటి వరకు రికార్డ్‌గా ఉండేది. దానిని నెల తిరిగేలోగానే సితోలే చెరిపేసింది.
ప్రగ్నెన్సీ సమయంలో తనకు చాలా ఇబ్బందిగా ఉండేదని సితోలే చెప్పుకొచ్చింది. స్కానింగ్ రిపోర్ట్ చూసి ఆందోళన చెందాను. 8 మంది పిల్లలు పుడతారంటే వారి ఆరోగ్యం ఎలా ఉంటుందో ఏమో అని ఆందోళ చెందాను, కాని పది మంది పిల్లలు ఆరోగ్యంగా పుట్టారు. కాకపోతే వారిని కొద్ది రోజుల పాటు ఇంక్యూబెటర్‌లో ఉంచాలని వైద్యులు చెప్పినట్లు వారు పేర్కొన్నారు.
సితోలే దంపతులకు మొత్తం 12 మంది పిల్లలు కాగా, వారి సంరక్షణను ఈ దంపతులు ఎలా చూసుకుంటారో మరి.