Cockroach: ఇదెక్క‌డి విడ్డూరం.. బొద్దింక‌కు ఐసీయూలో ఆక్సిజ‌న్ అందించి చికిత్స‌

Cockroach: ఇటీవ‌లి కాలంలో జ‌రుగుతున్న కొన్ని విచిత్రాలు చూస్తుంటే ముక్కున వేలేసుకోవ‌ల‌సిన ప‌రిస్థితి నెలకొంది. ఎలుక‌కు గోల్డ్ మెడ‌ల్ ఇవ్వ‌డం, బొద్దింక‌కు ఆక్సిజ‌న్ అందించి చికిత్స చేయడం ఇవ‌న్నీ కాస్త విడ్డూరంగానే ఉన్నాయి. కరోనా వ‌ల‌న ఆక్సిజ‌న్, బెడ్ దొర‌క్క చాలా మంది మృత్యువాత ప‌డుతున్నారు. బెడ్ దొరికించుకునేందుకు మ‌నుషులు నానా తంటాలు ప‌డుతుంటే బొద్దింక మాత్రం ఐసీయూలో చికిత్స పొందుతూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

Cockroach

థాయ్‌లాండ్‌లోని క్ర‌తుమ్ బ్యాన్ ప్రాంతంలో ద‌ను లింప‌ప‌ట్ట‌న‌వానిచ్ అనే యువ‌కుడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్న‌ప్పుడు అత‌నికి బొద్దింక క‌నిపించింద‌ట‌. ఎవ‌రో దాన్ని చూడ‌క తొక్క‌డంతో తీవ్రంగా గాయ‌ప‌డింది. క‌ద‌ల్లేని ప‌రిస్థితిలో ఉంది. అలాంటి ప‌రిస్థితిలో బొద్దింకని చూసి చ‌లించిపోయిన వ్య‌క్తి ఎలాగైన కాపాడాల‌ని ఆసుప‌త్రికి తీసుకెళ్ళాల‌ని భావించాడు. ఈ క్ర‌మంలో బొద్దింక‌ను అర‌చేతిలో మెల్ల‌గా ప‌ట్టుకొని సాయి రాక్ యానిమల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. అయితే ప‌శువుల ఆసుప‌త్రి డాక్ట‌ర్ లింపపట్టనవానిచ్ ఆ బొద్దింకను ఎమర్జెన్సీ పేషెంట్‌గానే భావించి దానికి ఉచితంగా వైద్యం చేస్తానని దనుకు మాటిచ్చాడు.

ఈ విష‌యాన్ని డాక్ట‌ర్ స్వ‌యంగా సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో వార్త వైర‌ల్‌గా మారింది. అయితే బొద్దింక బ‌తికేందుకు స‌గం మాత్రమే అవ‌కాశం ఉంద‌ని అంటున్నాడు. ప్రతి జీవి పట్ల కరుణ, జాలిని సూచిస్తుంది. ప్రతి జీవితం విలువైనది. ప్రపంచంలో ఇలాంటి వ్యక్తులు మరింత మంది ఉండాలని కోరుకుంటున్నారు అని పేర్కొన్నాడు. బొద్దింక‌ను ర‌క్షించ‌మ‌ని తొలిసారి ఓ వ్య‌క్తి రావ‌డం న‌న్నే ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఇలాంటి చిన్న జీవికి ఎప్పుడూ ట్రీట్మెంట్ ఇవ్వలేదు. దాన్ని బతికించడం నాకు ఛాలెంజ్ అనిపించింది. చిన్న జీవికి ఆక్సిజ‌న్ అందించాలంటే చాలా క‌ష్టం. ప్ర‌స్తుతానికి ఆక్సిజ‌న్ కంటైన‌ర్‌లో పెట్టాం. అదృష్ట‌వ‌శాత్తు బ్ర‌తికితే దాని బాగోగులు నువ్వే చూసేకోవాల‌ని బొద్దింక‌ను తీసుకొచ్చిన వ్య‌క్తికి చెప్పాను. అత‌డు అంగీక‌రించాడు అంటూ డాక్ట‌ర్ సోష‌ల్ మీడియాలో పేర్కోన్నాడు.