Bdelloid Rotifer: 24 వేల సంవత్సరాల క్రింద‌ట గ‌డ్డ క‌ట్టిన జీవి మ‌ళ్లీ బ్ర‌తికింది..!

Bdelloid Rotifer: ఈ సృష్టి లో ప్రకృతితో పాటు ఎన్నో వేల జీవులున్నాయి. ఈ జీవరాశికి తోడుగా లక్షల సంవత్సరాల నుండి కొనసాగుతున్నాయి. కాకపోతే మనిషి టెక్నాలజీ డెవెలెప్ మెంట్ తో ప్రకృతి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకే ఎన్నో రకాల జాతులు, జీవులు అంతరించిపోతున్నాయి. ఈ క్రమంలో ఓ జీవి ప్రాణం పోసుకుందని పరిశోధనలో తేలింది. డెల్లాయిడ్ రాటిఫర్.. ఇది 24000 సంవత్సరాల క్రిందట గడ్డ కట్టుకుపోయిన ఈ జీవి మళ్ళీ ఇప్పుడు తన ఉనికిని చాటుకుంది.

ఈ జీవిని సైబీరియాలో ఆర్కిటిక్ పెర్మాఫ్రోస్ట్ అంటే మంచుతో గడ్డకట్టుకుపోయిన సరస్సులో ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మైక్రోసోప్ సహాయంతో మాత్రమే ఈ రాటిఫర్ ను చూడగలం. ఈ అతి చిన్న జలచరం చూడ్డానికి అచ్చం జలగలా ఉంటుంది. దాదాపు 24 వేల సంవత్సరాలు ఈ జీవి ఘనీభవించిన స్థితిలో ఉండిపోయింది.

ఎన్నో వేల సంవత్సరాల తర్వాత దాని చుట్టూ ఉన్న మంచు కరిగిపోయి ఈ జీవి ఊపిరి తీసుకుంది. అంతేకాదు తన జాతిని పెంచే విధంగా సన్నాహాలు ప్రారంభించింది. ఈ జాతికి చెందిన జీవిలో మరో లక్షణం ఉంది. అదేంటంటే వీటిల్లో ఆడజీవులు మాత్రమే నివసిస్తాయి. మగవి ఉండవు.

ఆడజీవుల్లో ప్రత్యుత్పత్తికి కావాల్సిన అండాలు రిలీజై మగజీవి హెల్ప్ లేకుండానే అవి పిల్లల్ని పుట్టించగలదు. అంతేకాదు ఇవి గడ్డకట్టుకుపోయిన స్థితిలో ఉన్నా కొన్ని వేల సంవత్సరాలు బ్రతుకుతాయని రీసెంట్ చేసిన పరిశోధనలో తెలిసింది. ఈ బయటపడిన జీవి వయస్సు సుమారు 24,485 సంవత్సరాలు ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

రాటిఫర్ అంటే చక్రాలు కలిగి ఉన్నది అని అర్థం. ఈ పేరు లాటిన్ భాష నుండి వచ్చింది. డెల్లాయిడ్ రాటిఫర్ ఎక్కువగా చెరువుల్లో, సరస్సుల్లోనే జీవిస్తుంది. ఇవి ఎలాంటి వాతావరణ స్థితుల్లోనైనా తట్టుకుని జీవిస్తాయి. ఎన్నో సంవత్సరాలు ఆకలికి, డీహైడ్రేషన్ ను తట్టుకుంటాయని అంటున్నారు. అలాగే ఈ చిన్న జీవిలో ఎన్నో కణాలున్నాయి. బహుళ కణ జీవిని గడ్డకట్టుకుపోయే స్థితిలో కొన్ని వేల సంవత్సరాలు ఉంటాయని, వాటి చుట్టు ఉన్న మంచును కూడా కరిగించి మళ్ళీ ప్రాణాలతో ఉంటుందని ఈ జీవిపై చేసిన పరిశోధనల్లో తేలింది