Malinga: అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన యార్క‌ర్ కింగ్‌..!

Malinga: ఒక‌ప్పుడు క్రికెట్‌లో అద‌ర‌గొట్టిన స్టార్ క్రికెట‌ర్స్ మెల్ల‌మెల్ల‌గా రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తున్నారు. తాజ‌గా శ్రీలంక యార్క‌ర్ కింగ్ అంతర్జాతీయ టీ20 పోటీలకు వీడ్కోలు పలికాడు. మలింగ ఇదివరకే వన్డే, టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. మ‌ధ్య మ‌ధ్య‌లో టీ 20 మ్యాచ్‌లు ఆడుతూ వ‌చ్చిన మ‌లింగ్ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. ఈ విష‌యాన్ని మలింగ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించాడు.

Srilanka Cricketer Malinga Retire From All Forms of Cricket
Srilanka Cricketer Malinga Retire From All Forms of Cricket

ఈ రోజు నాకు చాలా ప్రత్యేకమైనది. నన్ను ప్రోత్సహించిన వారందరికి ధన్యవాదాలు. నా అనుభవాన్ని యువ క్రికెటర్లతో పంచుకుంటా‘అని తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు . కాగా 2019లో వన్డేలనుంచి తప్పుకోగా, 2011లో టెస్ట్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఐదు హ్యాట్రిక్ లు నమోదు చేసిన ఒకే ఒక్క బౌలర్ మలింగానే. అంతేకాదు, వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లను రెండుసార్లు పడగొట్టిన రికార్డు కూడా మలింగ పేరిటే నమోదై ఉంది.

ఐపీఎల్ లో మలింగ ఇప్పటికీ అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు. శ్రీలంక తరుపున 84 టీ20 మ్యాచ్ లు ఆడిన మలింగా 107 వికెట్లు పడగొట్టాడు. 228 వన్డేల్లో 338 వికెట్లు తీసిన మలింగ, 30 టెస్టుల్లో 101 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా తన అంతర్జాతీయ కేరిర్‌లో 546 వికెట్లు సాధించాడు. అంతేకాదు122 ఐపీఎల్‌ మ్యాచ్‌ లు కూడా లసిత్‌ మలింగ ఆడాడు. మలింగ కెప్టెన్సీలో శ్రీలంక జట్టు 2014లో టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది.

అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్న మలింగ… ఫ్రాంచైజీ క్రికెట్ నుంచి కూడా ఇంతకుముందే తప్పుకున్నాడు. ఫ్రాంచైజీ క్రికెట్లో మలింగ ఐపీఎల్, బిగ్ బాష్ వంటి పేరుమోసిన లీగ్ ల్లో పాల్గొన్నాడు. ఐపీఎల్‌లో ముంబై త‌ర‌పున ప‌లు మ్యాచ్‌లు ఆడిన మ‌లింగ చిర‌స్మ‌ర‌ణీయ విజయాలు అందించాడు.

మ‌రి కొద్ది రోజుల‌లో జ‌ర‌గ‌నున్న టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో పాల్గొన‌నున్న శ్రీలంక జ‌ట్టుకి కెప్టెన్సీ ఆశించాడు మ‌లింగ‌. అది ద‌క్క‌క‌పోవ‌డంతో వెంట‌నే రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. లంక క్రికెట్ బోర్డు యువకులకు పెద్దపీట వేస్తుండడం వంటి కారణాలతో ఇక తప్పుకోవడమే మేలని మలింగ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. గాయాల కారణంగా ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న 38ఏళ్ల లసిత్ మలింగ 2010 నుంచి టెస్టులకి, 2019 నుంచి వన్డేలకి దూరంగా ఉండిపోయాడు