Diwali : వింత : ఆ గ్రామం దీపావళిని 200 ఏళ్ల క్రితం బహిష్కరించిందట!
NQ Staff - October 24, 2022 / 09:24 AM IST

Diwali : దేశంలో ఎన్నో చిత్ర విచిత్రమైన గ్రామాలు ఉన్నాయి. వాటి పేర్లు వింతగా అనిపిస్తూ ఉంటాయి. కొన్ని ఊర్లలో ఉన్న పద్ధతులు వింతగా అనిపిస్తూ ఉంటాయి. తాజాగా మనం దీపావళి అనే పేరు ఉన్న గ్రామం గురించి తెలుసుకున్నాం.
ఆ గ్రామం ఎప్పుడు దీపావళి వచ్చిన వార్తల్లో ఉంటుంది. ఇప్పుడు అదే తరహాలో దీపావళి వస్తే వార్తల్లో ఉండే మరో గ్రామం గురించి ఇప్పుడు చూద్దాం రండి. దేశం మొత్తం దీపావళి పండుగ వైభవంగా జరుపుకుంటున్న ఈ సమయంలో శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పున్నానపాలెం గ్రామంలో మాత్రం దీపావళి జరుపుకోకుండా అమావాస్య చీకటిలోనే ఆ గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటుంటారు.
ఈ సంవత్సరం మాత్రమే కాకుండా గత రెండు వందల సంవత్సరాలుగా ఆ గ్రామ ప్రజలు దీపావళి మరియు నాగుల చవితి జరుపుకోవడం లేదు. అందుకు కారణమేంటంటే గ్రామ ప్రజలు చెబుతున్న దాని ప్రకారం 200 ఏళ్ల క్రితం దీపావళి మరియు నాగుల చవితి రోజు పాము కాటు వల్ల ఊయాలలోని చిన్నారి మరియు రెండు ఎద్దులు మరణించాయి.
అందుకే ఆ రెండు రోజుల్లో తమ గ్రామం విషాదంలో ఉంటుంది. అందుకే అప్పటి నుండి నాగుల చవితి మరియు దీపావళి పండుగ జరుపుకోవద్దని గ్రామస్తులు తీర్మానించుకున్నారట. 200 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన నేపథ్యంలో ఇంకా పండుగ జరుపుకోకుండా ఉండడం విడ్డూరంగా ఉంది అంటూ చుట్టు పక్కల గ్రామస్తులు ముక్కున వేలేసుకుంటారు.