Pulasa Fish : రెండు కేజీల పులస కోసం ఎగబడ్డ జనం.. రూ. 19 వేలకు విక్రయించిన భైరవపాలెం వ్యక్తి
NQ Staff - August 24, 2022 / 04:53 PM IST

Pulasa Fish : పులస చేప రుచే వేరేలా ఉంటుంది. పులస చేపలు తినాలని చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. గోదావరి నదికి ఎదురీదుతూ వెళ్లే పులస చేపల రుచి గురించి ఎంత చెప్పిన తక్కువే. పుస్తెలు అమ్మి అయినా సరే, పులస తినాలి అనేది సామెత. మరి అంతలా ఉంది పులస చేప క్రేజ్. వేల కిలో మీటర్ల దూరం నుంచి ఖండంతరాలు దాటుతూ.. నీటికి ఎదురీదే లక్షణమున్న ఈ చేపకు మార్కెట్‌లో యమ డిమాండ్ ఉంటుంది.
భారీ ధరకు..
పులస చేపలని కొనేందుకు జనాలు ఎగబడుతుంటారు. ఎంత ఖర్చైనా సరే వెనక్కు తగ్గరు. తాజాగా, గోదావరి వరద ఉద్ధృతి తగ్గడంతో మత్స్యకారులకు పులస చేపలు చిక్కుతున్నాయి. దీంతో యానాం మార్కెట్లో వాటి విక్రయాలు మొదలయ్యాయి. నిన్న ఇక్కడ రెండు కిలోల పులస చేపకు వేలం పాట నిర్వహిస్తే కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా రూ. 19 వేలకు నాటి పార్వతి అనే మహిళ ఈ చేపను దక్కించుకోగా, దానిని భైరవపాలేనికి చెందిన వ్యక్తికి విక్రయించారు.

Pulasa Fish Sales Started Yanam Market
ఈ సీజన్‌లో ఇదే అత్యధిక ధరని మత్స్యకారులు తెలిపారు. ఐ.పోలవరం మండలం భైరవపాలెం మొగ వద్ద ఇసుక మేటలు వేయడం వల్ల సముద్రంలోంచి గౌతమి పాయలోకి పులసలు చాలా తక్కువగా వస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఇదే చేప సముద్రంలో దొరికితే దానిని ‘వలస’ చేప అంటారు.
ఈ పులసలు ఒడిశాతో పాటు బంగ్లాదేశ్ తీరాల్లో కూడా దొరుకుతాయట.. కానీ గోదావరి చేపలకు ఉండే చేపల రుచి వేరుగా ఉంటుదంటున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సముద్ర జలాల్లో సంచరించే ఈ చేప సంతానోత్పత్తి సమయంలో గుడ్లు పెట్టడానికి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల సముద్ర జలాల్లోకి వస్తుందట. ఆషాడ, శ్రావణ మాసాల్లో ఇక్కడ గుడ్లు పెట్టి మళ్లీ సముద్రంలోకి వెళ్లిపోతుందట.