Pakistan: పాక్ క్రికెట్‌లో కొత్త మార్పులు.. హెడ్ కోచ్‌గా హెడెన్, బౌలింగ్ కోచ్‌గా ఫిలండర్‌

Pakistan: ప్ర‌పంచ క‌ప్‌లో పాకిస్తాన్‌కు ఎల్ల‌ప్పుడు ప‌రాభావాలే ఎదురవుతున్నాయి. ముఖ్యంగా భార‌త్‌తో జ‌రిగిన మ్యాచ్‌లలో పాక్ ఎక్కువ శాతం ఓట‌మిని చవి చూసింది. ఈ సారి ఎలా అయిన టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుచుకోవాల‌నే క‌సితో పాక్ ఉంది. అయితే టీ20 ప్రపంచకప్‌నకు ముందు పాకిస్తాన్‌ క్రికెట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాత్కాలిక కోచ్‌లుగా పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ఇద్దరు విదేశీయులకు అవకాశం కల్పించింది.

New Coaches in Pakistan Cricket, Hayden and Philander
New Coaches in Pakistan Cricket, Hayden and Philander

మెగా టోర్నీకి 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన రెండు గంటల్లోనే హెడ్ కోచ్‌ మిస్బా ఉల్ హ‌క్‌, బౌలింగ్ కోచ్‌ వ‌కార్ యూనిస్‌లు తమ ప‌ద‌వులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దాంతో తాత్కలిక కోచ్‌లుగా స‌క్లెయిన్ ముస్తాక్‌, అబ్దుల్ రజాక్‌ల‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నియమించింది. ఇక పీసీబీ చైర్మన్‌గా ఆ జట్టు మాజీ క్రికెటర్, స్టార్ కామెంటేటర్ రమీజ్ రాజా బాధ్యతలు చేప‌ట్టారు.

ఆయ‌న మీడియా స‌మావేశంలో ఆసీస్ మాజీ దిగ్గజ ఆటగాడు మాథ్యూ హెడెన్‌ను హెడ్ కోచ్‌గా, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ వర్నన్ ఫిలందర్‌ను బౌలింగ్‌ కోచ్‌గా ఎంపిక చేసిన‌ట్టు తెలియ‌జేశారు. ప్రపంచకప్ టోర్నీలు ఆడిన అతని అపార అనుభవం జట్టుకు ఎంత‌గానో ఉప‌యోగ ప‌డుతుంది. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో విధ్వంసకర ఓపెనర్‌లలో ఒకడిగా పెరుపొందిన హెడెన్ 103 టెస్టులు, 161 వన్డేలు , 9 టీ20లలో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు.

టీ20 ప్రపంచకప్‌కు 15 మందితో కూడిన జట్టును పీసీబీ ప్రకటించగా.. బాబర్ ఆజామ్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ జట్టులో ఐదుగురు స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌, ఇద్దరు వికెట్‌ కీపర్స్‌, నలుగురు ఆల్‌రౌండర్స్‌, నలుగురు ఫాస్ట్‌ బౌలర్స్‌ ఎంపికయ్యారు. కాగా ఫఖర్‌ జమన్‌, ఉస్మాన్‌ ఖాదీర్, షాహనవాజ్‌ దహానిలను రిజర్వ్‌ ఆటగాళ్లుగా ఉన్నారు. యువ ఆటగాడు అజమ్‌ ఖాన్‌ తుది జట్టులో చోటు దక్కించుకోగా.. ఆసిఫ్‌ అలీ, కుష్‌దిల్‌ షా లాంటి కొత్త ప్లేయర్స్ జట్టులోకి వచ్చారు. గ్రూప్ 2లో భాగంగా అక్టోబ‌ర్ 24న ఇండియా, పాకిస్థాన్ మ‌ధ్య దుబాయ్‌లో తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.