Khader : కదిలే ‘దుకాణం’.! భలే మంచి చౌక బేరమూ.!
NQ Staff - December 16, 2022 / 02:48 PM IST

Khader : కూటి కోసమే కోటి విద్యలు అంటారు పెద్దలు. కాస్త కొత్తగా ఆలోచిస్తే చాలు.. ఆ కోటి విద్యలే కోట్లు సంపాదించి పెడతాయ్. మరీ కోట్లు కాదు. కానీ, తన కుటుంబాన్ని సాఫీగా గడుపుకునేలా ఓ వ్యక్తి వినూత్న ఆలోచన చేశాడు.
అలా వచ్చిందే తోపుడు దుకాణం. ఓస్.. ఇదేమంత కొత్త పని కాదే. అనుకుంటారా.? అయితే, మీకీ విషయం తెలియాల్సిందే.
అనంతపురంలోని నందమూర్‌కి చెందిన ఖాదర్.. చిరు వ్యాపారం చేసి తన కుటంబాన్ని పోషించాలనుకున్నాడు. ‘చిరు’ వ్యాపారమే.. అయినా బోలెడంత ఖర్చుతో కూడుకున్నది. వచ్చే రాబడి, అద్దె ఇంట్లో తన కుటుంబాన్ని పోషించడానికి చాలదు.
కదిలే బండి.. అన్నీ దొరుకునండీ.!
దాంతో వినూత్న ఆలోచనకు తెర తీశాడు. తన వద్ద వున్న మోపెడ్ బండికి తోపుడు బండిని అమర్చుకున్నాడు. ఆ బండిలోనే సంసారం కూడా. అదే ఇల్లు. అదే దుకాణం. ఎక్కడికైనా వెళ్లిపోవచ్చు. ఎక్కడైనా నిలుపుకోవచ్చు.
అద్దె భారం లేదు. ఇక ఆఫ్ట్రాల్ తోపుడు బండే కదా.. ఇందులో ఎన్ని సామాన్లు పడతాయ్ అని లైట్ తీసుకుంటారా.? ఇంటి అవసరాలు తీర్చే అన్ని రకాల సామాన్లు.. ముఖ్యంగా లేడీస్‌కి సంబంధించిన ఫ్యాన్సీ ఐటెమ్స్ సూది పిన్నుల నుంచి ఆకర్షణగా కనిపించే జ్యూయలరీ ఐటెమ్స్ వరకూ అన్నీ ఆ దుకాణంలో పట్టించేశాడు.
అలాగే గృహోపకరణానికి అవసరమయ్యే అన్ని రకాల ప్లాస్టిక్ సామాన్లు కూడా ఖాదర్ బండిలో లభిస్తాయ్. వీధి వీధిలో తిరుగుతూ ఓ వైపు వ్యాపారం, మరోవైపు కాపురం.. ఇలా రెండింటినీ సంతోషంగా బ్యాలెన్స్ చేస్తున్నాడు ఖాదర్.