Jarvo: ఇండియా బౌల‌ర్‌కి థ్యాంక్స్ చెప్పిన జార్వో.. ఎందుకో తెలుసా?

Jarvo: జార్వో .. ఈ పేరు క్రికెట్ ప్రియుల‌కి చాలా సుప‌రిచితం. లార్డ్స్ టెస్టులో, హెడ్డింగ్‌లే టెస్టులో క్రీజులోకి దూసుకొచ్చి… ఆటకి అంతరాయం కలిగించిన డానియల్ జార్వీస్, ఉరఫ్ జార్వో ఎంత హంగామా సృష్టించాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఓ సారి బ్యాట్స్‌మెన్‌గా, ఓ సారి బౌలర్‌గా… మరోసారి ఫీల్డర్‌గా క్రీజులోకి దూసుకొచ్చిన జార్వో సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు.

Jarvo Say Thanks to Jasprit Bumrah
Jarvo Say Thanks to Jasprit Bumrah

ఇంగ్లాండ్‌లో సెక్యూరిటీ కళ్లుగప్పి మూడు సార్లు మైదానంలోకి వచ్చాడు జార్వో. దీంతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, స్టేడియాల్లో భద్రతా ఏర్పాట్లపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ క్ర‌మంలో జార్వోను సీరియస్‌గా తీసుకున్న ఇంగ్లాండ్, అతన్ని అరెస్టు చేయడమే కాకుండా… క్రిమినల్ కేసు నమోదుచేసినట్టు సమాచారం. అయితే తాను తాజ‌గా భార‌త బౌల‌ర్‌కి థ్యాంక్స్ చెప్పాడు.

భారత్, ఇంగ్లాండ్ మధ్య కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా సోమవారం రాత్రి నాలుగో టెస్టు మ్యాచ్ ముగియగా.. ఈ మ్యాచ్‌లో 157 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో జాన్వీ బెయిర్ స్టో డ‌కౌట్ అయ్యాడు. ఇందుకు గాను బుమ్రాకి కృత‌జ్ఞ‌త‌లు చెప్పాడు జార్వీ. అయితే జార్వీ బుమ్రాకి కృత‌జ్ఞ‌త‌లు చెప్ప‌డానికి కార‌ణం ఉంది.

తొలి ఇన్నింగ్స్‌లో ఉమేశ్ యాదవ్ బౌలింగ్ చేసేందుకు సిద్ధమవుతుండగా.. టీమిండియా జెర్సీ ధరించిన జార్వో మైదానంలోకి దూసుకొచ్చి లాంగ్ రనప్‌తో ఓలీ పోప్‌కి బంతి విసిరినట్లు యాక్షన్ చేశాడు. అయితే.. ఈ క్రమంలో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని జానీ బెయిర్‌స్టోని జార్వో ఢీకొనగా.. అతను కోప్పడి మైదానం వెలుపలికి వెళ్లాల్సిందిగా వార్నింగ్ ఇచ్చాడు. అంతకముందు లీడ్స్ టెస్టులోనూ మైదానంలోకి వచ్చిన జార్వోపై బెయిర్‌స్టో నోరుజారాడు.

ఓవల్ టెస్టు మ్యాచ్‌లో చివరి రోజైన సోమవారం జానీ బెయిర్‌స్టో (0: 4 బంతుల్లో)ని జస్‌ప్రీత్ బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. తనని కోప్పడిన బెయిర్‌స్టోని డకౌట్ చేయడంతో బుమ్రాకి సోషల్ మీడియా ద్వారా జార్వో థ్యాంక్స్ చెప్పాడు. ప్ర‌స్తుతం అత‌ను చేసిన ట్వీట్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. భారత్, ఇంగ్లాండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా శుక్రవారం నుంచి ఐదో టెస్టు మ్యాచ్ జరగనుంది.