T20 World Cup: ఒక్క వికెట్ కోల్పోకుండా భార‌త్‌పై ఘన విజ‌యం సాధించిన పాక్

T20 World Cup: భార‌త్‌-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు జ‌రిగినా కూడా చాలా థ్రిల్లింగ్‌గా గేమ్ ఉంటుంది. కాని ఈ సారి మాత్రం వార్ వ‌న్‌సైడ్ అయిపోయింది. మొద‌టి నుండి పాకిస్తాన్ టీమ్ ఆధిప‌త్యం క‌న‌బ‌ర‌చింది. భారత్‌ వర్సెస్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌లో దాయాది జట్టు విజయకేతనాన్ని ఎగుర వేసింది.

TheNewsQube-
India Lost Match With Pakistan in T20 World Cup
India Lost Match With Pakistan in T20 World Cup

ఓ వైపు బౌలింగ్‌లో భారత్‌ను తక్కువ పరుగులకు కట్టడి చేయడమే కాకుండా.. లక్ష్యాన్ని చాలా సులువుగా చేధించింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకోని సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.భారత్‌ ఘోరపరాజయంపై క్రికెట్‌ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలోనే తమ ఆవేదనను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

ఐసీసీ మేజర్‌ టోర్నీల్లో పాకిస్తాన్‌పై టీమిండియాకు ఘనమైన రికార్డు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్‌, టి20 ప్రపంచకప్‌ కలిపి 12-0తో స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. తాజాగా పాకిస్తాన్‌ టీమిండియాపై అద్బుత విజయంతో తొలిసారి ఆ రికార్డును బ్రేక్‌ చేస్తూ 12-1 తో నిలిచింది.

India Lost Match With Pakistan in T20 World Cup
India Lost Match With Pakistan in T20 World Cup

ఇండియా- పాక్ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భార‌త్ మొద‌ట్లోనే ఓపెన‌ర్స్ వికెట్స్ పోగొట్టుకుంది. పాకిస్థాన్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంలో భారత ఆటగాళ్లు పెవిలియన్‌ బాట పట్టారు. టీమిండియా బ్యాట్స్‌మెన్‌లో కేవలం విరాట్‌ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్‎ను విరాట్ ఆదుకున్నాడు. 48 బంతుల్లో 57(ఐదు ఫోర్లు, ఒక సిక్స్) పరుగులు చేశాడు.

పాకిస్థాన్‌ ఓపెనర్ల వేగాన్ని మాత్రం భారత బౌలర్లు అడ్డుకట్ట వేయలేకపోయారు. ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా పాక్‌ సంచలన విజయాన్ని నమోదు చేసింది. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 17.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్లు బాబర్‌ అజమ్‌(68 పరుగులు, 52 బంతులు; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), మహ్మద్‌ రిజ్వాన్‌లు‌( 79 పరుగులు, 55 బంతులు; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఊదిపారేశారు.