Kabul: కాబూల్ ఎయిర్‌పోర్ట్ వ‌ద్ద భారీ పేలుడు..పెర‌గుతున్న మృతుల సంఖ్య‌

Kabul: ఆఫ్ఘ‌నిస్తాన్ ప్ర‌జ‌లు ఉలిక్కిప‌డే వార్త‌.కాబూల్ ఎయిర్‌పోర్ట్ వ‌ద్ద భారీ పేలుడు జ‌ర‌గ‌డంతో ఆ ప్ర‌మాదంలో చాలా మంది మ‌ర‌ణించిన‌ట్టు తెలుస్తుంది. ఒక‌వైపు తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకోవడంతో అక్కడ ప‌రిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఆదేశంలో ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. తాలిబ‌న్ల చెర నుండి త‌ప్పించుకునేందుకు ఆఫ్ఘ‌న్స్ ప్ర‌య‌త్నిస్తుండ‌గా, మ‌రో వైపు మిగ‌తా దేశాల వారు త‌మ ప్ర‌జ‌ల‌ను త‌ర‌లిస్తున్నారు.

ఈ క్ర‌మంలో కాబూల్‌ విమానాశ్రయం వెలుపల భారీ పేలుడు సంభవించింది. దీనిని ఆత్మాహుతి దాడిగా అమెరికా రక్షణ శాఖ భావిస్తోంది. బాంబు పేలుడు సంఘటనకు ముందు ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో ఇటాలియన్ విమానంపై కాల్పులకు తెగబడ్డారు. ఎయిర్ పోర్ట్ వ‌ద్ద ప‌లు చోట్లు పేలుళ్లు చోటు చేసుకోగా, అమెరికా హెచ్చరించిన 24 గంటల్లోపే ఈ పేలుళ్లు జ‌ర‌గ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

ఎయిర్‌పోర్ట్ వెలుపల నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 11 మంది నాటో సైనికులు మరణించగా, భారీ సంఖ్యలో గాయపడినట్లుగా తెలుస్తోంది. పేలుడు ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు పెంటగాన్‌ అధికారులు సమాచారమిచ్చారు. కాగా, కాబూల్‌ విమానాశ్రయం వద్ద దాడులు జరగొచ్చని ఉదయమే అమెరికా రక్షణ శాఖ హెచ్చరించింది. బ్రిటన్‌, ఆస్ట్రేలియా సైతం ఈ హెచ్చరికలను సమర్థించాయి. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

అయితే ఇటాలియ‌న్ విమానం టేకాఫ్ అవుతున్న స‌మ‌యంలో ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌ర‌ప‌డంతో అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన పైలట్.. విమానాన్ని సురక్షితంగా తప్పించారు. ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. కాబూల్ నుంచి అధికారులు, జర్నలిస్టులను తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

పేలుడు వెనక తాలిబాన్లే ఉన్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రాణ నష్టం తదితర వివరాలు తెలియాల్సి ఉందని అమెరికా రక్షణ శాఖ అధికార ప్రతినిధి జాన్‌ కిర్బీ పేర్కొన్నారు.