Bhuvneshwar Kumar : మ్యారేజ్ డే త‌ర్వాతి రోజే తండ్రి ప్రమోష‌న్ అందుకున్న భువ‌నేశ్వ‌ర్ కుమార్

Bhuvneshwar Kumar : భారత క్రికెట్ జట్టులోని పలువురు క్రికెటర్ల మాదిరే భువనేశ్వ‌ర్ కుమార్ కూడా డాడీస్ ఆర్మీలో చేరాడు. అతడి భార్య నుపుర్ నగర్.. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. నిండు గర్భిణీగా ఉన్న నుపుర్ కు మంగళవారం నొప్పులు రావడంతో ఆమెను ఢిల్లీలోని ఓ ప్రైవేట్ దవాఖానాలో చేర్పించారు. ఆమెతో ప్రస్తుతం భువీ తల్లి, చెల్లెలు ఉన్నారు.

Bhuvneshwar Kumar Wife Nupur Welcome Their First Child
Bhuvneshwar Kumar Wife Nupur Welcome Their First Child

భువనేశ్వర్ కుమార్ కుటుంబం ఉత్తర ప్రదేశ్‌లోని మీరఠ్‌లో నివాసం ఉంటుంది. అనారోగ్య కారణాలతో అతని తండ్రి కిరణ్ పాల్ సింగ్ ఈ ఏడాది మే 20వ తేదీన మరణించారు. తల్లి, భార్యతో కలిసి అతను మీరఠ్‌లో నివసిస్తోన్నాడు. 2017 నవంబర్ 23వ తేదీన నుపుర్‌ను వివాహం చేసుకున్నాడు. తొలి సంతానంగా ఆ దంపతులకు ఆడపిల్ల జన్మించింది.

ఈ సమాచారం తెలిసిన వెంటనే భువి తల్లి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మీరఠ్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కోశాధికారి రాకేష్ గోయెల్ ఆమె వెంట ఉన్నట్లు తెలుస్తోంది. తల్లీ-బిడ్డ క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారని రాకేష్ గోయెల్ చెప్పారు. గురు లేదా శుక్రవారాల్లో నుపుర్ నగర్ డిశ్చార్జ్ అవుతారని అన్నారు.

టీవలే ముగిసిన ఇండియా-న్యూజిలాండ్ టీ20 సిరీస్ నేపథ్యంలో ఇంటికి దూరంగా ఉన్న భువీ.. గురువారం ఢిల్లీ వెళ్లి తన కూతురును చూడబోతున్నాడు. కాగా- టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా తొలి సంతానంగా ఆడబిడ్డే జన్మించిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ-బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనూష్క శర్మ దంపతులకు ఆడబిడ్డ పుట్టింది.

నిన్ననే భువనేశ్వర్-నుపుర్ లు నాలుగో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. 2017 నవంబర్ 23న వారి వివాహం జరిగింది. పెళ్లి రోజు మరుసటి రోజే భువీ తండ్రి కావడం విశేషం. భువీ తండ్రైన విషయం తెలుసుకున్న పలువురు భారత క్రికెటర్లు ట్విట్టర్ వేదికగా అతడికి శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఇటీవల కాలంగా ఫామ్ లేమితో తంటాలు పడుతున్న భువీకి ఇది శుభవార్తే.టీ20 ప్రపంచకప్ లో దారుణంగా విఫలమై విమర్శలు ఎదుర్కొన్న భువనేశ్వర్.. ఇటీవలే న్యూజిలాండ్ తో ముగిసిన మూడు మ్యాచుల టీ20 సిరీస్ లో అదిరిపోయే ప్రదర్శనలు చేయకున్నా నిలకడగా బౌలింగ్ చేశాడు. టెస్ట్ సిరీస్‌లో అత‌నికి చోటు ద‌క్కలేదు.