YS Sharmila : వైఎస్ షర్మిల మాకు రూ.10 వేల కోట్లు ఇస్తారు. అయినా..

YS Sharmila : తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన వైఎస్ షర్మిల అప్పుడే ‘ఆపరేషన్ ఆకర్ష్’కి తెర లేపినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పేరునున్న లీడర్లని ఆమె తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో ‘ఫైర్ బ్రాండ్’ ఫ్యామిలీ అయిన కొండా కుటుంబానికి కూడా వైఎస్ షర్మిల నుంచి ఫోన్ వెళ్లిందంట. తన పార్టీలో చేరాలని ఆమె కొండా మురళీ, కొండా సురేఖ దంపతులను కోరారంట. అయితే వాళ్లు అందుకు నిరాకరించారని వార్తలు వస్తున్నాయి. తాము పార్టీ మారబోమని, కాంగ్రెస్ లోనే కొనసాగుతామని తేల్చిచెప్పారంట. ఈ విషయాలను కొండా మురళీధర్ రావు నిన్న శుక్రవారం వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రమైన హన్మకొండలోని తన నివాసంలో స్వయంగా చెప్పారు.

YS Sharmila : ys sharmila invite konda family to her party
YS Sharmila : ys sharmila invite konda family to her party

భారీగానే. కానీ..

‘‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల నుంచి మాకు పిలుపు వచ్చింది. నేను హస్తం పార్టీ నుంచి ఆమె పార్టీలోకి వెళితే మాకు రూ.10 వేల కోట్లు ఇస్తారు. కానీ మాకు డబ్బు ముఖ్యం కాదు. విలువలే ప్రధానం. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ని వీడబోమని చెప్పాం’’ అని కొండా మురళి పేర్కొన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ పార్టీ కేడర్ తో కొండా దంపతులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పైన పేర్కొన్న విషయాలను వెల్లడించారు. ఒక వైపు కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతున్నా టీఆర్ఎస్ పార్టీ ఓటమి భయంతోనే మున్సిపల్ ఎన్నికలు పెట్టిందని కొండా సురేఖ విమర్శించారు.

ప్రత్యేక అనుబంధం: YS Sharmila

కొండా సురేఖ దంపతులకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఉంది. వైఎస్ చనిపోయిన తర్వాత కూడా వైఎస్ జగన్ తో కలిసి ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవటంతో టీఆర్ఎస్ పార్టీలో చేరి కొండా సురేఖ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రస్తుతం అందులోనే కొనసాగుతున్నారు. తెలంగాణలో ఇప్పుడు హస్తం పార్టీ ఫామ్ లో లేదు కాబట్టి కొండా కుటుంబం వైఎస్ ఫ్యామిలీతో ఉన్న అనుబంధం కారణంగా వైఎస్ షర్మిల పార్టీలో చేరినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని రాజకీయ విశ్లేషకులు అనుకున్నారు. కానీ కొండా జంట ఇలా వెరైటీగా స్టేట్మెంట్ ఇవ్వటం కాస్త ఆసక్తికరమే.

రేపు విరమణ..

ఇదిలాఉండగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేస్తూ మొన్న దీక్ష మొదలుపెట్టిన వైఎస్ షర్మిల వరుసగా మూడో రోజూ అంటే ఇవాళ శనివారం కూడా దీక్ష కొనసాగిస్తున్నారు. రేపు ఆదివారం ఉదయం 10 గంటల తర్వాత దీక్షను విరమించే అవకాశాలు ఉన్నాయి. కాగా వైఎస్ షర్మిల ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement