YS Sharmila : మీకు తండ్రైనా.. కొడుకైనా.. భర్తైనా.. నేనే..

YS Sharmila: కరోనా వైరస్ సెకండ్ వేవ్ నేపథ్యంలో రాజకీయ పార్టీల ఆలోచనల్లో క్రమంగా మార్పులు వస్తున్నాయి. దాదాపు అన్ని పార్టీలూ కొవిడ్ బాధితుల కోసం సహాయ కార్యక్రమాలను చేపడుతున్నాయి. అదే క్రమంలో వైఎస్ షర్మిల కూడా ముందుకు వచ్చారు. ఈ మహమ్మారి వల్ల కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయిన ఆడబిడ్డలకు తాను అండగా ఉంటానని ప్రకటించారు. బాధిత కుటుంబానికి తండ్రైనా, భర్తైనా, కొడుకైనా తానే అవుతానని భరోసా ఇచ్చారు. సహాయం కావాల్సినవారు కాల్ చేయండి అంటూ ఒక ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. కొవిడ్ కష్టాన్ని ఒంటరిగా ఎదుర్కొంటున్న అమ్మలారా.. అక్కలారా.. అంటూ ఆప్యాయంగా ఆహ్వానించారు.

YS Sharmila

నిరాశతో కుంగిపోవద్దు..

‘‘కరోనా వైరస్ ఎంతో మంది జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. కుటుంబాలకు ఆర్థికంగా తోడుగా నిలిచే ఎంతో మంది కొవిడ్ బారినపడి చనిపోయారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయి ఒక వైపు.. కుటుంబాన్ని నెట్టుకు రాలేక మరో వైపు.. ఇలా ఎంతో మంది మహిళలు నిరాశా నిస్పృహలతో కుంగిపోతున్నారు. సంపాదించే వ్యక్తి భౌతికంగా దూరమైతే ఆ కుటుంబాల బాధేంటో నాకు తెలుసు. పోయినవారిని తీసుకురాలేం. కానీ ఆ మహిళల బాధను కాస్తయినా పంచుకోవాలని అనుకుంటున్నా. ఆడబిడ్డలారా మీరు ధైర్యం కోల్పోకుండా ఉండండి. మీ కాళ్ల మీద మీరు నిలబడటానికి.. మళ్లీ మీ జీవితం సాఫీగా సాగిపోవటానికి.. మీరంతా మన వైఎస్సార్ కుటుంబ సభ్యులుగా భావించి.. నా వంతుగా మీకు ఏదైనా సహాయం చేయాలనుకుంటున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి మహిళలు ఎవరైనా ఉంటే మన ‘‘ఆపదలో తోడుగా వైఎస్ఎస్ఆర్’’ ఫోన్ నంబర్ కి కాల్ చేసి చెప్పండి. ఆ నంబర్ 040-48213268’’ అని షర్మిల పేర్కొన్నారు.

YS Sharmila

నాన్న సీఎం అయిన రోజు..

వైఎస్ఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన శుభదినం మే 14. ఆయన పాలన తెలుగు ప్రజలకు స్వర్ణయుగం. అభివృద్ధికి నిర్వచనం చెప్పినవాడు. సంక్షేమానికి తానే సంతకమైనవాడు. ఆఖరి శ్వాస వరకు తెలుగు ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాడు. జోహార్ వైఎస్సార్, మీరే మాకు ఆదర్శం అని షర్మిల గుర్తు చేసుకున్నారు. అందుకే నిన్న శుక్రవారం ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.