YS Sharmila: ‘సాక్షి’కి షర్మిల కౌంటర్ వేయగా.. విజయమ్మ ఏమన్నారంటే..

YS Sharmila ‘సాక్షి’ మీడియా ఎవరిదో చెప్పక్కర్లేదుగా. వైఎస్ కుటుంబానిదని అందరికీ తెలిసినా ఈరోజు ప్రత్యేకంగా చర్చించుకోవాలి. ఎందుకంటే ఆ టీవీవాళ్లకి ఇవాళ వైఎస్ షర్మిల అనూహ్యంగా, స్వీట్ గా కౌంటర్ వేశారు. ‘మాకు ఎలాగూ మీరు కవరేజీ ఇవ్వరుగా’ అంటూ చురకలంటించారు. దీంతో పక్కనే ఉన్న వైఎస్ విజయమ్మ షాక్ కి గురయ్యారు. వెంటనే షర్మిల వైపుకి ఫేస్ తిప్పి చూశారు. అంతేకాదు. ఎడమ చేత్తో షర్మిలని చిన్నగా తట్టారు. ‘‘ఏంటా మాటలు’’ అన్నట్లుగా సైగా చేశారు. ఇది సోషల్, రెగ్యులర్ మీడియాలో బాగా వైరల్ అయింది. సాక్షాత్తూ వైఎస్ షర్మిలే ‘సాక్షి’ పట్ల ఇలా అసంతృప్తి వ్యక్తం చేయటం అనేది పెద్ద వార్తగా మారింది.

ఎక్కడ?.. ఎందుకు?..

వైఎస్ షర్మిల ఇవాళ గురువారం ఉదయం నుంచి హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ధర్నాచౌక్ లో ఉద్యోగ దీక్ష పేరుతో తొలిసారిగా దీక్షా కార్యక్రమం చేపట్టారు. సహజంగా ఎక్కడ, ఎవరి మీటింగ్ జరిగినా ముందు వరుసలో ఉండేది మీడియానే. సభా వేదిక మీద ఉన్నోళ్లు సభకు హాజరైన ప్రజానీకానికి కనిపించినా, కనిపించకపోయినా దాన్నెవరూ పట్టించుకోరు. నాయకులు కూడా ముఖ్యంగా మీడియాలో కనిపిస్తే చాలు అనుకుంటారు. కానీ షర్మిల అలా కాదు. తాను దీక్ష చేస్తున్నది మీడియా కోసం కాదు అంటూ నిర్మొహమాటంగా చెప్పేశారు. కెమెరాలన్నింటినీ పక్కకు తీయాలంటూ సూచించారు.

అయినా వినకపోవటంతో..

‘‘మీరు అట్లా చేస్తే ఎట్లమ్మా?. మేం దీక్ష చేస్తున్నది మీ కోసమా? జనాల కోసమూ? చెప్పండి. మీ కోసం కాదుగా. జనాల కోసం కదా. కాబట్టి కోపరేట్ చేయండి. ప్లీజ్. సభా వేదిక మీదికి వచ్చే దారిలో గ్యాప్ ఇవ్వండి. కొంత మంది ఇటు, కొంత మంది అటు వెళ్లండి. మధ్యలో ఉన్న 5 కెమెరాలు తీసేయండమ్మా’’ అని షర్మిల కాసేపు ఓపిగ్గా రిక్వెస్ట్ చేశారు. దీనికి ‘సాక్షి’ టీవీవాళ్లు ఏదో అబ్జెక్షన్ చెప్పినట్లున్నారు. మీకు కవరేజీ ఇవ్వటం కోసమే కదా మేడం అని షర్మిలకే ఎదురు చెప్పబోయినట్లున్నారు. దానికి షర్మిల స్పందిస్తూ ‘‘ఇంక చాల్లే. మీ కవరేజీ చాల్లేమ్మా అయితే. ఎట్లాగూ మాకు ‘సాక్షి’ కవరేజీ ఇవ్వదుగా’’ అని కాస్త వెటకారంగానే దెప్పిపొడిచారు.

Advertisement