Revanth Reddy : రేవంత్ రెడ్డి పాదయాత్రతో మరో రాజశేఖర్ రెడ్డి అయ్యేనా?
NQ Staff - January 21, 2023 / 11:09 PM IST

Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించి ముగింపు దశకు చేరుకున్న విషయం తెలిసిందే.
ఈ సమయంలోనే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పాదయాత్ర నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ కొత్త ఇన్చార్జ్ మాణిక్ రావు థాక్రే ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.
అందులో భాగంగా ఈనెల 26వ తారీఖున హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రను లాంఛనంగా ప్రారంభిస్తారు. అంతే కాకుండా ఫిబ్రవరి 6వ తేదీ నుండి రెండు నెలల పాటు రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ఇందుకు గాను అధినాయకత్వం నుండి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలుస్తోంది.
భట్టి విక్రమార్క ప్రచార కమిటీ చైర్మన్ ఇంకా ఇతర పార్టీ ముఖ్య నేతలు అంతా రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొనబోతున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర కార్యక్రమానికి సోనియా గాంధీ లేదా ప్రియాంక గాంధీ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా సమాచారం అందుతుంది.
మొత్తానికి గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి ముఖ్యమంత్రిగా గెలిచారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి మరో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గా నిలుస్తాడా అనేది చూడాలి.