Gangavva: గంగవ్వనా, మజాకానా.. ఊరికి బస్సు తెప్పించిందిగా..!
NQ Staff - April 25, 2022 / 09:39 AM IST

Gangavva: గంగవ్వ.. ఈవిడి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆమె గొంతులో ఏదో ఆకర్షణ.. ఆమె మాట్లాడుతుంటే మన అవ్వ మాట్లాడిన అనుభూతి. తక్కువ కాలంలోనే యూట్యూబ్ స్టార్‌గా ఎదిగిన గంగవ్వ బోలెడంత పాపులారిటీ సంపాదించుకున్నారు. లేటు వయసులో ఆమెకు మంచి పాపులారిటీ వచ్చినా.. చిన్న వయసులో ఆమె ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ కష్టాలను ఆమె నాగార్జున ముందు చెప్పుకున్నారు.

TSRTC Services Started in Gangavva Village
మై విలేజ్ షో పేరుతో యూట్యూబ్ లో విడుదలైన వీడియోలు బాగా ప్రాచుర్యం పొందాయి. గంగవ్వ తెలంగాణా యాక్సెంట్, ఆటిట్యూడ్, బిహేవియర్ యూట్యూబ్ ప్రేక్షకులకు మజా పంచేది. గంగవ్వ వీడియోలకు మిలియన్స్ వ్యూస్ దక్కేవి. సోషల్ మీడియా సీలెబ్రెటీగా మారిన గంగవ్వకు బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొనే అవకాశం దక్కింది.
60ఏళ్ల గంగవ్వ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ కూడా గంగవ్వ సూపర్ హిట్. టైటిల్ కొట్టి చూపిస్తా అంటూ శబధం కూడా చేశారు. అయితే పల్లెవాతారణంలో పుట్టిపెరిగిన గంగవ్వకు హౌస్ వాతావరణం సరిపడలేదు. నాలుగు గోడల మధ్య ఏసీ గదుల్లో ఆమె ఉండలేకపోయారు. హోమ్ సిక్ కారణంగా అనారోగ్యం బారినపడ్డారు.
గంగవ్వ రిక్వెస్ట్ మేరకు బిగ్ బాస్ ఆమెను 5వ వారం హౌస్ నుండి బయటకు పంపివేశారు. అయితే మధ్యలో నిష్క్రమించినా సొంత ఇల్లు కట్టుకోవాలనే ఆమె కలను నెరవేరుస్తానని నాగార్జున హామీ ఇచ్చారు. బిగ్ బాస్ నిర్వాహకులు, నాగార్జున చొరవతో సొంత ఊరిలో గంగవ్వ రూ. 20 లక్షల ఖర్చుతో ఇంటిని నిర్మించుకున్నారు. తన సొంతింటి కలను నిజం చేసుకున్న గంగవ్వ తాజాగా తన సొంతూరికి తిరిగి బస్సు సర్వీసును తీసుకొచ్చింది.
గంగవ్వది తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లి గ్రామం. ఈ గ్రామానికి మొదట్లో బస్సు సర్వీసు ఉండేది. అయితే కరోనా కారణంగా రెండేళ్లుగా లంబాడిపల్లికి ఆర్టీసీ బస్సు రావట్లేదు. దీంతో గ్రామస్థులు, వ్యవసాయ దారులు, కూలీలు, విద్యార్థులు జగిత్యాల జిల్లా కేంద్రానికి వెళ్లి రావడానికి ఇబ్బందులు పడ్డారు. ప్రైవేట్ వాహనాల్లో జగిత్యాలకు వెళ్లి రావాలంటే వాహన చార్జీలతో తలకుమించిన భారమైంది.
తమ సమస్యలకు పరిష్కారంగా బస్సు సర్వీసును తిరిగి ప్రారంభించాలనుకున్నారు లంబాడిపల్లి గ్రామ ప్రజా ప్రతినిధులు. ఇందుకోసం బిగ్‌బాస్ ఫేమ్, యూట్యూబ్ స్టార్ గంగవ్వ సహాయం కోరారు. లంబాడిపల్లికి తిరిగి బస్సు తీసుకురావాలన్న లక్ష్యంతో గ్రామస్థులతో కలిసి జగిత్యాల ఆర్టీసీ డిపో అధికారులను కలిసింది గంగవ్వ బృందం. గంగవ్వ వినతితో లంబాడిపల్లికి బస్సు సర్వీసును తిరిగి పునరుద్ధరించారు అధికారులు. ప్రస్తుతం ఈ గ్రామానికి జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి ఐదు ట్రిప్పలుగా ఆర్టీసీ సేవలు అందిస్తోంది. లంబాడిపల్లికి తిరిగి బస్సు రావడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.