Komatireddy Rajagopal Reddy : నేను గెలిస్తే మునుగోడుకి కేంద్రం 1000 కోట్ల రూపాయల నిధులిస్తుంది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
NQ Staff - October 19, 2022 / 08:55 PM IST

Komatireddy Rajagopal Reddy : తెలంగాణలో రాజకీయ వేడిని రాజేసిన మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి, బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడం తథ్యమని అంటున్నారు. మునుగోడు అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానంటోన్న బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో న్యూస్ క్యూబ్ ప్రతినిథి నిర్వహించిన ‘స్ట్రెయిట్ టాక్ విత్ శ్రావణి’ విశేషాలివీ..
కాంగ్రెస్ అభ్యర్థిగా గతంలో పోటీ చేసినప్పుడు ఎలాగైతే మునుగోడు ప్రజానీకం తనను ఆశీర్వదించారో, ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో మునుగోడు ప్రజలు తన మీద ప్రేమాభిమానాలు కురిపిస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు.
‘ముఖ్యమంత్రి కేసీయార్, మునుగోడు అభివృద్ధికి సహకరించడంలేదు. అసెంబ్లీలో మా గొంతు నొక్కుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై మునుగోడు ప్రజల తరఫున పోరాటం చేసేందుకే రాజీనామా చేశాను. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం వుంటే, మునుగోడు వేగంగా అభివృద్ధి చెందుతుంది’ అని అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
మునుగోడులో స్థానికేతరులెవరూ ప్రచారం చేయట్లేదు..
‘ఢిల్లీ నుంచి నాయకులొస్తున్నారు, వారి మొహాలేవీ మునుగోడు ప్రజలకు తెలియదు..’ అంటూ ఢిల్లీ బీజేపీ నేతలు మునుగోడుకు రావడంపై తెలంగాణ రాష్ట్ర సమితి ఎద్దేవా చేస్తోంది కదా.? అన్న ప్రశ్నకు సమాధానమిచ్చిన రాజగోపాల్ రెడ్డి, ‘ఇప్పటివరకూ జాతీయ నాయకులెవరూ మునుగోడులో ప్రచారానికి రాలేదు. మునుగోడు ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకుంటారు..’ అని సమాధానమిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీయార్ కుటుంబం బాగు పడింది తప్ప, తెలంగాణ రాష్ట్రం బాగుపడలేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ‘మునుగోడులో బీజేపీ అభ్యర్థిగా నేను గెలిస్తే, కేంద్రం వెయ్యి కోట్ల రూపాయలు నిధులు ఇస్తుంది.. రోడ్లు బాగుపడతాయ్.. హాస్పిటల్ వస్తుంది..’ అని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు.
మునుగోడు తీర్పుతో కేసీయార్ ప్రభుత్వం కుప్పకూలుతుంది ‘మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో కేసీయార్ ప్రభుత్వం కుప్ప కూలిపోతుంది. తెలంగాణలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. తెలంగాణను కేసీయార్ పరిపాలించలేరు..’ అంటున్నారాయన.
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (రాజగోపాల్ రెడ్డి సోదరుడు) ఎవరికి మద్దతిస్తారు.? అన్న ప్రశ్నకు సమాధానమిచ్చిన రాజగోపాల్ రెడ్డి, ‘ఆయన ధర్మం వైపు నిలబడతారు.. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన వెంకటరెడ్డి, అదే తెలంగాణ కోసం ఇప్పుడు నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను గనుక.. నా వైపే నిలబడతారు..’ అని స్పష్టతనిచ్చారు.