అమ్మంటే అంత ప్రాణమా.. ఏకంగా గుడి క‌ట్టి పూజలు చేస్తున్న ఇద్ద‌రు కుమారులు

అమ్మ నవ మాసాలు మోసి మనల్ని కంటోంది. పుడుతూ ఎంతో బాధ పెట్టినా కూడా..తొలిసారి బిడ్డను చూడగానే ఆమె ముఖంలో ఎంతో ఆనందం కనిపిస్తోంది. ఇక అప్పట్నుంచి పిల్లలే ఆవిడ సర్వస్వం. తాను..తిన్నా..తినకపోయినా బిడ్డల ఆకలి తీర్చడం ఆమెకు ముఖ్యం. అందుకే బిడ్డ ఆకలి తీరాకే తల్లి ఆకలి మొదలవుతోంది అనే అద్భుతమైన డైలాగ్ సినిమాలో రాశాడు రచయిత సాయి మాధవ్ బుర్రా. అమ్మ గొప్పదనం గురించి చెప్పడానికి ఓ జీవితం సరిపోదు. ఎందుకంటే మనం ఈ భూమి రాకముందు నుంచే ఆమె ప్రేమ మొదలవుతోంది. ఆమె ప్రేమ వర్ణణాతీతం. అలాంటి అమ్మకు మనం తిరిగి ఎంత ప్రేమను పంచగలుగుతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. మీ ప్రేమ ఎక్కువ అనుకుంటే..కాస్త కింద  చదవండి.

మీరు ఇప్పటి వరకు దేవతలకు మాత్రమే గుడి కట్టడం చూశారు. కానీ ఇద్దరు కుమారులు తల్లి మీద ప్రేమతో గుడి కట్టించారు. అమ్మ ప్రేమను వెలకట్టలేమంటూ ఆమెకు ప్రతినిత్యం పూజలు చేస్తున్నారు. అమ్మమీద ఆ కొడుకుల ప్రేమను చూసిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం దుర్గారం గ్రామానికి చెందిన జంగ సదానందం, రాజులు తమ తల్లి జంగ నర్సమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గత ఏడాది డిసెంబర్ ఒకటో తేదీన కన్నుమూసిన నర్సమ్మకు ఇటీవల సంవత్సరీకం నిర్వహించారు. ఈ నేపథ్యంలో వారి పొలం వద్ద సుమారు పది లక్షల వ్యయంతో ప్రత్యేకంగా నిర్మించిన భవనంలో తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి, బంధుమిత్రుల సమక్షంలో ఆవిష్కరించారు.

రోజంతా చేను వద్ద ఉండే తాము తల్లిని ఎప్పటికీ మర్చిపోకుండా ఉండేందుకు, ఇలా చెలక వద్దనే గుడి నిర్మించుకున్నామని చెబుతున్నారు. కటిక పేదరికంలో ఉన్నపుడు ఆమె పస్తులుండి, తమను పెంచిందని, కూలీ నాళీ చేసి తమకు కష్టం తెలియకుండా సాకిందంటూ తల్లిని తలచుకుంటూ కంటతడి పెట్టుకున్నారు. వయసు మీరిన తల్లిదండ్రులను పట్టించుకోకుండా వృద్దాశ్రమాల్లో వదిలి పెడుతున్న వారిని అనేకం చూస్తున్నాం. అలాంటిది తల్లి మరణించినా తమ జ్ఞాపకాలలో పదిలంగా ఉండాలని గుడికట్టించి పూజిస్తున్న ఈ కుమారులను గ్రామస్తులు అభినందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here