Nagarjuna Sagar: ‘నాగార్జునసాగర్’లో 400 నామినేషన్లు..

Nagarjuna Sagar నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నికకు సంబంధించి నిన్న గురువారం నాటికి ఎనిమిది నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. నామినేషన్ వేసేందుకు ఈ నెల 30 చివరి తేదీ. అంటే ఇంకా ఐదు రోజులే గడువుంది. కానీ ఇందులో మూడు రోజులు సెలవులే. కాబట్టి నికరంగా ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం ఉన్నట్లు లెక్క. కాగా.. ఇక్కడ దాఖలయ్యే నామినేషన్ల సంఖ్య ఒక్కసారిగా 400 దాటనున్నాయి. వీటిని తెలంగాణ అమర వీరుల ఐక్య వేదిక (టీఎంఎఫ్) తరఫున ఫైల్ చేయనున్నారు. ఈ విషయాన్ని టీఎంఎఫ్ ప్రెసిడెంట్ మేకల రఘుమారెడ్డి లేటెస్టుగా తెలిపారు. అమర వీరుల కుటుంబాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఇండిపెండెంట్లుగా నామినేషన్లు వేస్తారని ఆయన స్పష్టం చేశారు.

ఎందుకిలా?..

‘‘ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు 1,385 కుటుంబాలను మాత్రమే గుర్తించింది. ఇంకా 500 కుటుంబాలు సర్కారు నుంచి చిల్లిగవ్వ సాయం కూడా అందక నానా యాతనలు పడుతున్నాయి. వాళ్ల సమస్యల్ని గవర్నమెంట్ దృష్టికి తేవటానికి మేం ఈ మార్గం ఎంచుకున్నాం’’ అని రఘుమారెడ్డి పేర్కొన్నారు. ఇంకా ఎక్కువ నామినేషన్లే వేయాలనుకున్నా ఆర్థిక, ఇతర ఇబ్బందులు వల్ల 400కే పరిమితం అయ్యామని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక టీఆరెస్ ప్రభుత్వం ప్రతి అమరవీరుడి కుటుంబానికి రూ.10 లక్షలు, ఒకరికి గవర్నమెంట్ జాబ్, ఇల్లు, ఐదెకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చిందని, చాలా కుటుంబాలు ఇంతవరకూ వాటికి నోచుకోలేదని రఘుమారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో పోరాడేందుకు తమకు ‘దళిత్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ’ లాంటి అసోసియేషన్లు అండగా నిలిచాయని చెప్పారు.

by elections
by elections

రఘమారెడ్డి అరెస్ట్?..

టీఎంఎఫ్ అధ్యక్షుడు రఘుమారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఉద్యోగాలు ఇప్పిస్తానంటున్న కొంత మంది దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నాడనే ఫిర్యాదుతో అతణ్ని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. రఘుమారెడ్డిపై ఇప్పటికే 12 కేసులు నడుస్తున్నాయని దర్యాప్తులో తేలిందని సమాచారం. ప్రస్తుతం ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి నాగార్జునసాగర్ బైఎలక్షన్ లో పోటీకి రెడీ కాగా టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. మరో వైపు.. తెలంగాణ అమర వీరుల కుటుంబాలతో రఘుమారెడ్డికి సంబంధంలేదని కొన్ని అమర వీరుల కుటుంబాలు తేల్చిచెప్పాయి. ఈ మేరకు వాళ్లు నల్గొండ ఎస్పీ రంగనాథ్ కు లెటర్ ఇచ్చాయి.

Advertisement