Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వేదాంతం..
Kondala Rao - May 25, 2021 / 07:47 PM IST

Kishan Reddy: తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి వేదాంత ధోరణిలో మాట్లాడారు. తాను సీఎం కేసీఆర్ కి అనుకూలమంటూ పని గట్టుకొని ప్రచారం చేసేవాళ్లను ఆ దేవుడే చూసుకుంటాడని అన్నారు. కిషన్ రెడ్డి సున్నిత మనస్కుడంటారు గానీ మరీ ఇంత సెన్సిటివ్ అని ఎవరూ ఊహించలేదు. పాలిటిక్సులో ఇంత అనుభవం కలిగిన, కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న ఒక నేత రాజకీయ విమర్శలకు సమాధానం చెప్పే క్రమంలో కూడా దేవుణ్ని ప్రస్తావించటం కాస్త విడ్డూరంగానే ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా బీజేపీలో గ్రూపులు ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి ఎలా తెలుసంటూ కిషన్ రెడ్డి అమాయకంగా అడిగారు. ఇంత చిన్న విషయం రేవంత్ రెడ్డి దాకో మరెవరి దాకో ఎందుకు.. ప్రతిఒక్కరికీ తెలుసు. బండి సంజయ్ గ్రూపు, కిషన్ రెడ్డి గ్రూపు అంటూ రాష్ట్ర బీజేపీలో రెండు గ్రూపులు ఉన్నాయనేది తెలంగాణ జగం ఎరిగిన సత్యమే.
ఈటల ఇష్యూ..
కిషన్ రెడ్డి ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పారు. టీఆర్ఎస్ సీనియర్ లీడర్, తాజా మాజీ మంత్రి ఈటల రాజేందర్ తనను కలుస్తానంటూ ఫోన్ లో సంప్రదించిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. శాసన సభలో ఈటలతో 15 ఏళ్లు కలిసి పని చేశానన్న కిషన్ రెడ్డి.. రీసెంటుగా ఆయన్ని డైరెక్ట్ గా కలుసుకోలేదన్నారు. ఫోన్ లో మాత్రం మాట్లాడానని వెల్లడించారు. రానున్న రోజుల్లో ఈటలతో రాజకీయ చర్చలు జరుపుతామని పేర్కొన్నారు.
హైకమాండ్ ని అడగలేదు..
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే జరగబోయే ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిని పోటీకి పెట్టాలా లేదా అనే అంశాన్ని తానింకా పార్టీ అధిష్టానంతో చర్చించలేదని కిషన్ రెడ్డి చెప్పారు. ఈటల ఇష్యూని కిషన్ రెడ్డి డీల్ చేస్తున్నారంటేనే తెలంగాణ బీజేపీలో రెండు గ్రూపులు ఉన్నాయని అర్థం. ఎందుకంటే అవినీతి ఆరోపణలొచ్చిన వ్యక్తిని పార్టీలో చేర్చుకోవాలా వద్దా అనేది ఆలోచించాల్సి ఉంటుందంటూ బండి సంజయ్ గతంలో ఈటలను ఉద్దేశించి పరోక్షంగా వెటకారమాడాడు. అందుకే ఈ అంశం కిషన్ రెడ్డి వద్దకు చేరినట్లు తేలిపోతోంది.