KTR: ఏం చేస్తాం?.. ఇదంతా మన దురదృష్టం.. కేటీఆర్ ఆవేదన..

KTR: దేశానికి కాదు.. ప్రపంచానికి సరిపడా వ్యాక్సిన్లు తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో తయారవుతున్నా మన ప్రజలకు అందుబాటులో లేకుండా పోవటం పట్ల రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆవేదన చెందారు. ఇదంతా మన దురదృష్టమని నిస్సహాయత వ్యక్తం చేశారు. దీనికంతటికీ కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని పట్టి చూపారు. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న టీకాల్లో 85 శాతం వ్యాక్సిన్లను మోడీ సర్కారు తన అధీనంలో పెట్టుకుంటోందని, మిగిలిన 15 శాతం టీకాలనే రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేట్ హాస్పిటల్స్ కు కేటాయిస్తోందంటూ అసంతృప్తి వెలిబుచ్చారు. ఈ మేరకు ఆయన ఇవాళ శుక్రవారం రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడలోని తిప్పాపూర్ లో మీడియాతో మాట్లాడారు.

KTR

హైదరాబాద్, కరీంనగర్ వెళ్లొద్దు..

తిప్పాపూర్ లో నిర్మించిన వంద బెడ్ల హాస్పిటల్ ని మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కరోనా బారినపడితే హైదరాబాద్, కరీంనగర్ వంటి పెద్ద సిటీలకు వెళ్లాల్సిన పని లేదని, ఇక్కడే చికిత్స పొందొచ్చని చెప్పారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రాణవాయువు కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, కొవిడ్ ట్రీట్మెంట్ కి కావాల్సిన అన్ని మెడిసిన్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రెండు సార్లు ఇంటింటి సర్వే చేశామని, బ్లాక్, వైట్ ఫంగస్ నివారణకు సంబంధించిన మందులను కూడా తెస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

KTR

వ్యాక్సినేషనే.. సొల్యూషన్..

కరోనా మహమ్మారికి టీకాలు మాత్రమే శాశ్వత పరిష్కారమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. గతేడాది కొవిడ్ తగ్గుముఖం పట్టాక మన దేశం ఇతర దేశాలకు ఔషధాలను ఎక్స్ పోర్ట్ చేయకుండా ఉండి ఉంటే ఇప్పుడు ప్రజలందరికీ టీకాలు అందేవని అన్నారు. వ్యాక్సిన్ల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం లేకుండా చేయటం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని విమర్శించారు. ఏదేమైనప్పటికీ తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోందని, ఒక వేళ మళ్లీ వ్యాప్తి పెరిగినా కంట్రోల్ చేసేందుకు రెడీగా ఉన్నామని మంత్రి కేటీఆర్ వివరించారు. హైదరాబాద్ లోని విరించి హాస్పిటల్ లో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఎక్కువ ఫీజు వసూలు చేస్తున్నారని వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ ను ఆదేశించారు.

KTR