Mallareddy : మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు.! ఏం దొరికిందబ్బా.?
NQ Staff - November 23, 2022 / 09:16 AM IST

Mallareddy : తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, టీఆర్ఎస్ నేత మల్లారెడ్డి పేరు చెబితేనే బోల్డంత ఎంటర్టైన్మెంట్. కామెడీ చేస్తారు, సీరియస్ యాక్షన్ కూడా చెయ్యగలుగుతారు. ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు చేయాల్సి వస్తే, అస్సలేమాత్రం తగ్గరు. విద్యా సంస్థలే కాదు, మెడికల్ కాలేజీ కూడా వుంది. ‘కాలేజీలు’ అనడం సబబేమో.!
మొన్నీమధ్యనే మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా మంత్రి మల్లారెడ్డి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మునుగోడు నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓటర్లను హైద్రాబాద్‌లోని తన ఆసుపత్రికి తరలించి, వైద్య చికిత్సలు ఉచితంగా చేయించారు మల్లారెడ్డి.
ఐటీ సోదాలు.. మల్లారెడ్డి సంగతేంటి.?
అలాంటి మల్లారెడ్డి ఇళ్ళు, కార్యాలయాలపై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టారు. ఉదయం నుంచీ సోదాలు జరుగుతూనే వున్నాయి. మంత్రిగారి సన్నిహితుల ఇళ్ళలోనూ సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాల్లో కోట్లాది రూపాయల నగదు పట్టుబడిందనే ప్రచారం జరుగుతోంది.
‘ఇది అన్యాయం, అక్రమం..’ అంటూ అధికార పార్టీ నేతలు గుస్సా అవుతున్నారు. గులాబీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. అయితే, మల్లారెడ్డి మాత్రం, సాయంత్రం బయటకు వచ్చి ‘మద్దతిచ్చిన కార్యకర్తలకు’ థ్యాంక్స్ చెప్పి, ‘ఇక చాలు, వెళ్ళిపోండి..’ అంటూ దండం పెట్టేశారు. మరోపక్క, సోదాలు కొనసాగుతున్నాయి. రెండు మూడు రోజులపాటు సోదాలు జరిగే అవకాశం వుందట.
కళాశాలల్లో అక్రమంగా ఫీజులు వసూలు చేసి, వాటికి లెక్కలు సరిగ్గా చూపించలేదన్నది ప్రధాన ఆరోపణ.