Hyderabad : ‘సేవ్ హైదరాబాద్’ కోసం.. ‘‘గ్రేటర్’’ నిర్ణయాలు..

Hyderabad : హైదరాబాద్ మహానగరాన్ని కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవటం కోసం బల్దియా యంత్రాంగం శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రోడ్ల మీది చెత్తను తొలగించటం ప్రారంభించింది. దీంతోపాటు సిటీవ్యాప్తంగా సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. ఫాగింగ్ కూడా చేపట్టారు. మరోవైపు జీహెచ్ఎంసీలో కంట్రోల్ రూమ్ సేవలని మళ్లీ ప్రారంభించారు. రెండు నంబర్లను (9154686549, 58) రోజులో 24 గంటల పాటు అందుబాటులో ఉంచారు. కరోనాకి సంబంధించిన ఎలాంటి సమాచారం, సహాయం కావాలన్నా వీటికి కాల్ చేయొచ్చు. వీటన్నింటికీ మించి ఇవాళ గురువారం మధ్యాహ్నం అతిపెద్ద నిర్ణయం తీసుకున్నారు. గతంలో మాదిరిగానే కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు.

Hyderabad : greater municipal corporation decisions to save hyderabad from corona
Hyderabad : greater municipal corporation decisions to save hyderabad from corona

30 సర్కిళ్లలో.. 63..

కొవిడ్-19 రోజురోజుకీ విశ్వరూపం ప్రదర్శిస్తుండటంతో బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నగర ప్రజలని మరింత అప్రమత్తం చేసేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నిత్యం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వెంటనే అమల్లోకి తెస్తోంది. ఈరోజు సిటీ మొత్తమ్మీద 30 సర్కిళ్ల పరిధిలో 63 మినీ కంటైన్మెంట్ జోన్లని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ జోన్లలో పటిష్టమైన, కఠినమైన చర్యలు చేపడతారు. కరోనా పాజిటివ్ కేసులు 5 కన్నా ఎక్కువ నమోదైతే ఆ ప్రాంతాన్ని మినీ కంటైన్మెంట్ జోన్ గా గుర్తిస్తున్నారు. ఒకే అపార్ట్మెంట్ లో ఈ కేసులు వస్తే దాన్ని హౌజ్ క్లస్టర్ గా ఏర్పాటుచేస్తారు. ఆయా ఏరియాల్లో బారికేడ్లు పెట్టి స్థానికుల రాకపోకలను కంట్రోల్ చేస్తారు. ఫ్లెక్సీలు కట్టి అవగాహన కల్పిస్తారు.

వాళ్లకే అనుమతి: Hyderabad

మినీ కంటోన్మెంట్ ప్రాంతాల్లోకి శానిటైజేషన్, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని మాత్రమే అనుమతిస్తారు. హైరిస్క్ ప్రదేశాల్లో ఇంటెన్సివ్ శానిటైజేషన్, యాంటీ లార్వా స్ప్రేయింగ్ చేస్తారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తిరిగే ఏరియాల్లో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(డీఆర్ఎఫ్) రంగంలోకి దిగి సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పవర్ స్ప్రేల ద్వారా చల్లుతున్నారు. దాదాపు 19 డీఆర్ఎఫ్ టీమ్ లు రంగంలోకి దిగాయి. కూకట్ పల్లి, నిజాంపేట్, కేపీహెచ్బీ, మియాపూర్ తదితర ప్రాంతాల్లో ఈ ప్రక్రియ నిర్వహించారు. దీనికితోడు నగరవ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్న విషయం విధితమే.

Advertisement