తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రతిరోజు ఏదో ఒక వ్యాఖ్య చేస్తూ వివాదాలకు దారి తీస్తున్నారు. అలాగే సాధ్యంకాని హామీలను ప్రకటిస్తూ జనాల్లో నవ్వుల పాలవుతున్నారు. ఆయన తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు తన భుజాలపై వేసుకొని దుబ్బాక ఉప ఎన్నికల్లో చాలా దూకుడుగా వ్యవహరించి రఘునందన్ రావు గెలవడానికి సహాయపడ్డారు. దుబ్బాక గెలుపుతో రఘునందన్ రావు పేరు ఎలా మారుమ్రోగిందో.. అంతకు రెండురెట్లు ఎక్కువ గానే బండి సంజయ్ పేరు తెలుగు రాష్ట్రాల్లో బాగా వినపడింది.
దుబ్బాక ఉప ఎన్నికలలో పరాజయం పొందిన తర్వాత వెంటనే గ్రేటర్ ఎన్నికలు నిర్వహించడానికి కేసీఆర్ సర్కార్ పూనుకుంది. ప్రచారానికి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉండటంతో బండి సంజయ్ మళ్ళీ ప్రచార బరిలోకి దిగి తనదైన శైలిలో అధికార పార్టీని విమర్శిస్తూ.. తమ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ కొన్నిసార్లు బండి సంజయ్ చేసే వ్యాఖ్యలు, ఇచ్చే హామీలు లాభం కంటే నష్టమే చేకూరుస్తున్నాయి. మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ అల్లర్లకు దారితీసి ఎన్నికలు వాయిదా వేయాలని కేసీఆర్ ని బాగా టార్గెట్ చేస్తూ ముచ్చెమటలు పట్టిస్తున్నారు బండి సంజయ్. కానీ తన దూకుడు వ్యవహారం కాస్త శృతిమించడంతో అసలుకే ఎసరు వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారుల చలాన్ల ను తామే కడతామని పప్పులో కాలేశారు బండి సంజయ్. తప్పు చేయండి మీ బదులు మేమేం జరిమానా కడతాం అన్నట్టు బండి సంజయ్ హామీ ఇవ్వడంతో ప్రజలు బాగా నవ్వుకున్నారు. హైదరాబాద్ వరదలో ఎవరెవరి కార్లు, బైకులు కొట్టుకుపోయాయో వారికి కొత్త కార్లను, బైకులను తామే ఇస్తామని మరొక హామీ కూడా ఇచ్చారు. ఈ హామీ గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. బైకులకు, కార్లకు ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేలా చేసి కొత్త కార్లు బైకులు కొనిస్తాం అని బండి సంజయ్ సమాధానమిచ్చారు. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న వాహనదారులు తమంతట తామే ఇన్సూరెన్స్ కంపెనీ కి వెళ్లి డబ్బులు తెచ్చుకోగలరు కానీ ఇక్కడ బండి సంజయ్ చేసేదేముంది? ఇది తాను సొంతంగా నెరవేర్చ గల హామీ ఎలా అవుతుంది? అని మరోసారి ప్రజలు నవ్వుకున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీని బండి సంజయ్ తీరుపై తీవ్ర ఆగ్రహానికి గురి అవుతున్నారని తెలుస్తోంది.