Bandi Sanjay : బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు అనుమతి.!
NQ Staff - November 28, 2022 / 03:17 PM IST

Bandi Sanjay : బీజేపీ తెలంగాణ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు అనుమతిచ్చింది. ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రను బండి సంజయ్ నేటి నుంచి ప్రారంభించనుండగా, పాదయాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు నిన్న రాత్రి బండి సంజయ్‌ని అడ్డుకున్న సంగతి తెలిసిందే.
భైంసా వెళ్ళేందుకు బండి సంజయ్ ప్రయత్నించగా, ఆయన్ని జగిత్యాల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఇంట్లోంచి బయటకు వస్తే బండి సంజయ్‌ని అరెస్టు చేస్తామని ఈ రోజు ఉదయం కూడా పోలీసులు హెచ్చరించారు.
హైకోర్టును ఆశ్రయించి ఊరట పొందిన బండి సంజయ్..
అయితే, పోలీసుల తీరుపై హైకోర్టును ఆశ్రయించిన బండి సంజయ్, హైకోర్టు నుంచి ఉపశమనం పొందారు. అయితే, భైంసా పట్టణంలోకి వెళ్ళకుండా పాదయాత్ర నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.
3 వేల మందితో భైంసా పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో సభ నిర్వహించవచ్చుననీ, పాదయాత్రలో 500 మంది మాత్రమే పాల్గొనాలనీ హైకోర్టు షరతులు విధించింది.
హైకోర్టు నుంచి షరతులతో కూడిన అనుమతి వచ్చిన దరిమిలా, బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ఈ రోజు ప్రారంభమయ్యేందుకు మార్గం సుగమం అయ్యింది.