Etela : ‘ఈటల’ను పట్టుకొని వేలాడుతున్న పచ్చ మీడియా
Kondala Rao - March 22, 2021 / 07:39 PM IST

Etela : రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎల్లో మీడియా గురించి తెలియనివారులేరు. ఈ పసుపు మీడియా ఈమధ్య పచ్చ కామెర్లు వచ్చినోడి మాదిరిగా పిచ్చి ఆనందం పొందుతోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. తెలంగాణలో సీఎం కేసీఆర్ కి రాజకీయంగా ఎదురే లేదని నిన్న గాక మొన్నే ప్రజలు మరోసారి తేల్చిచెప్పటంతో ఆ మీడియాకి ఏం చేయాలో పాలుపోక రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ ని పట్టుకొని వేలాడుతోందని అంటున్నారు. ఆయన టీఆరెస్ పార్టీ హైకమాండ్ (కేసీఆర్) పైన అలకబూనారంటూ పులిహోర వార్తలు ఫుల్లుగా వండి వార్చుతోందని చెబుతున్నారు. ఆ ఉద్దేశంతోనే ఈటల ఏదో లోతైన అర్థంతో నిన్న మాట్లాడారని చెప్పుకొస్తోంది. ఆరోగ్య శాఖ మంత్రిని ముఖ్యమంత్రి తన సమావేశాలకు పిలవట్లేదని ఆ మీడియా వార్తలు రాసిన 24 గంటల్లోపే ఆయన ఇవాళ సోమవారం సీఎం కేసీఆర్ ని ప్రగతి భవన్ లో కలవటం గమనార్హం. దీన్నిబట్టి పచ్చ మీడియా పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఇట్టే తేలిపోయింది. తెలంగాణలో లాక్డౌన్ పెట్టబోతున్నారంటూ ఫేక్ న్యూస్ రాసింది కూడా ఆ ఎల్లో మీడియానే కావటం చెప్పుకోదగ్గ విషయం. ఆ వార్తలకు కూడా తెలంగాణ గవర్నమెంట్ శరవేగంగా ఫుల్ స్టాప్ పెట్టడం విశేషం.

Etela : yellow media happy with etela rajender comments
స్వార్థం.. స్వల్ప సంతోషం: Etela
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ సేవలని టీఆరెస్ పార్టీ వాడుకోలేదని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎలక్షన్ బాధ్యతను ఈటలకు బదులుగా మరో మంత్రి గంగుల కమలాకర్ కి అప్పగించారని పచ్చ మీడియా పట్టి చూపింది. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పల్భాపూర్ గ్రామంలో ఆదివారం నిర్వహించిన ఒక సమావేశంలో ఈటల మాట్లాడుతూ కులం, డబ్బు, పార్టీ జెండా ఏదీ శాశ్వతం కాదని, మనిషిని గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ వ్యాఖ్యలను అడ్డం పెట్టుకొని ఆయన గులాబీ పార్టీలో ఇమడలేకపోతున్నారని తెలుస్తున్నట్లు ఎల్లో మీడియా ఏదేదో రాసుకొచ్చింది. ఈటల ఎప్పుడో ఒకప్పుడు కేసీఆర్ పైన తిరుగుబాటు జెండా ఎగరేసే ఛాన్స్ లేకపోలేదని, ఇప్పుడు ఇస్తున్న సంకేతాలు అవేనని ఊహాజనితమైన అంశాలతో కథనాలు ప్రచురిస్తోంది. ఇలా అల్ప, స్వల్ప స్వార్థ సంతోషం పొందే బదులు అసలు ఈటల ఆవిధంగా ఎందుకు మాట్లాడారో డైరెక్టుగా అడిగి తెలుసుకొని ఆయన అభిప్రాయాన్ని అచ్చు వేయొచ్చు కదా అని టీఆరెస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.