DH Srinivasa Rao : కరోనా కథ ముగిసినట్టేనా.. ఇది కూడా సీజనల్ వ్యాధిగా మారిందా?
NQ Staff - July 13, 2022 / 02:34 PM IST

DH Srinivasa Rao : మానవ మనుగడపై వైరస్‌లదే పై చేయి అని ఎప్పటి నుండో శాస్త్రవేత్తలు చెప్పుకొస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఎన్నో వైరస్‌లు మనుషులపై తమ ప్రభావాన్ని చూపించాయి. పెను ఉప్పెన వచ్చి పచ్చని చేలనూ, పంటలనూ ఊడ్చిపెట్టినట్టే, వైరస్ క్రిములూ మానవ జీవితాల్ని నాశనం చేస్తాయని చెబుతూనే ఉన్నారు.
కరోనా కథ కంచికేనా?
ఇటీవల కరోనా మహమ్మారి సృష్టించిన వినాశనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా వలన సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం కన్నుమూశారు. ప్రతి సంవత్సరం కూడా కొత్త వేరియెంట్ పుట్టుకొస్తుండగా, ప్రజలలో భయాందోళనలు వ్యక్తం అవుతూ వస్తున్నాయి. అయితే కోవిడ్ నాలుగో వేవ్ వస్తుందేమోనని ఆందోళన చెందుతున్న సమాజానికి తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు (డీహెచ్) శుభవార్త చెప్పారు.
కొత్త వేరియంట్ వస్తే తప్ప ప్రపంచాన్ని పట్టి పీడించిన కోవిడ్ అనే మహమ్మారి కథ ముగిసినట్టే అన్నారు. కోవిడ్ నుంచి బయటపడ్డామన్నారు. తాజాగా సీజనల్ వ్యాధులతో పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. గత ఆరు వారాలుగా కోవిడ్ కేసుల సంఖ్య పెరిగిందన్నారు. అయితే కరోనా గురించి భయపడాల్సిన పనిలేదన్నారు. ఇది ముగింపు దశకు చేరిందన్నారు.

DH Srinivasa Rao Said Covid Be Seasonal Disease
ఇప్పుడు కరోనా వచ్చిన కూడా సాధారణ జలుబు, జ్వరం లక్షణాలుంటాయన్నారు. కోవిడ్ కూడా సీజనల్ వ్యాధిగా మారిందని ఆయన చెప్పుకొచ్చారు. కోవిడ్ లక్షణాలుంటే కేవలం ఐదు రోజులే క్వారంటైన్‌లో వుండాలన్నారు. మరోవైపు గత వారం రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆహారం, నీళ్లు కలుషితం కాకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో మలేరియా కేసులు కూడా నమోదవుతున్నాయని డీహెచ్ తెలిపారు. ఈ ఏడాది టైఫాయిడ్ కేసులు కూడా ఎక్కువగా నమోదు అవుతున్నాయన్నారు. ప్రజలు సరైన ఆహారం, మంచినీరు తీసుకోవాలని కోరారు. ఆహారం వేడిగా ఉండేలా చేసుకోవాలన్నారు. గోరువెచ్చటి నీటిని తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా వ్యక్తిగత జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాలన్నారు.