హీరో రోడ్డు ప్ర‌మాదం అంటే అంద‌రు ఉరికారు, చిన్నారి అత్యాచారంపై స్పందించ‌రేమి?

ప్రపంచంలో మహిళ అనే పదానికి ఎంతో విలువ, గౌరవం ఉన్నాయో.. వారిపై అంతే చిన్న చూపు కూడా ఉంది. ఏం చేసినా అడిగే నాథుడు ఉండడు అనో లేదా మనమేం చేసినా పర్లేదనుకునే ఆలోచన కారణంగానో మృగాళ్ళల్లో పైశాచికత్వం పెరిగిపోతుంది. సమాజంలో మానవత్వం రోజురోజుకు మంటగలిసిపోతుంది. ఎన్ని చట్టాలు వచ్చినా.. నాగరికంగా ఎంత ఎదిగినా.. అమానుషంగా ఆడవాళ్ళపై అఘాయిత్యాలు పెరిగిపోతుంది.

A Small Baby Incident Vs Sai Dhaaram Accident
A Small Baby Incident Vs Sai Dhaaram Accident

అందులోనూ పసివయస్సులో ఉన్న పిల్లల్ని కూడా వదలకుండా అతి దారుణంగా హింసించి చంపుతున్నారు. అలా ఎంతోమంది చిన్నారులు బలయ్యారు. ప్రభుత్వం కూడా కఠిన చట్టాల్ని అమలుచేయడంలో విఫలం అవుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల సైదాబాద్ సింగరేణి ప్రాంతంలో జరిగిన ఆరేళ్ళ చిన్నారి దారుణ అత్యాచార ఘటనపై ప్రస్తుతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చిన్నపిల్లను అత్యంత అమానుషంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై ప్రభుత్వం తీరు కరెక్ట్ కాదని ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆ చిన్నారికి న్యాయం చేయాలని ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు ప్రారంభించారు. ఈ క్రమంలో ప్రముఖ నటుడికి జరిగిన గాయాలకు క్షణాల్లో స్పందించిన ప్రభుత్వం ఒక చిన్నపిల్ల దారుణ హత్యపై ఎలాంటి స్పందన లేదని అంటున్నారు.

నటుడు విషయంలో పరిగెత్తుకుంటూ వెళ్ళిన మంత్రులు చిన్నారిపై జరిగిన ఘటనపై ఎందుకు నోరు విప్పడం లేదంటూ, తన తల్లిదండ్రులను పరామర్శించడానికి ఎందుకు ముందుకు రాలేదంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. చిన్నారిపై జరిగిన ఈ ఘటనకు హనుమకొండ జిల్లాలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు క్యాండిల్ ర్యాలీ చేశారు.

కేయూ క్రాస్ రోడ్ దగ్గర నిరసన చేసారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అదేవిధంగా ఈ పాప అత్యాచార ఘటనకు నిరసన తెలియజేస్తూ వికారాబాద్ లో గిరిజన సంఘాల నేతలు ర్యాలీ చేశారు. హైదరాబాద్ లో పలు చోట్ల చిన్నారి జీవితాన్ని నాశనం చేసిన నిందితుడికి కఠిన శిక్ష విధించాలని ర్యాలీ చేపట్టారు.