Google : మానవత్వం లేని గూగుల్.. ఇది నీకు న్యాయమా?
NQ Staff - January 23, 2023 / 09:42 PM IST

Google : ఆర్థిక మాంద్యం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు సాఫ్ట్వేర్ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగస్తులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ఏకంగా 12,000 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్పు పంపించింది.
వారందరికీ కూడా గూగుల్ సీఈవో సుందర్ పిచ్చై ఉద్యోగాల నుండి తొలగిస్తున్నట్లుగా ఈమెయిల్స్ పంపించారు. ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. జాబ్ నుండి తొలగించబడ్డ వారు అంతా కూడా రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఇప్పటికే కొందరు వేరే ఉద్యోగాలను వెతుక్కుంటూ ఉంటే మరి కొందరు మాత్రం కొత్త ఉద్యోగంలోకి వెళ్లడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. గూగుల్ పింక్ స్లిప్ పంపించిన వారిలో ప్రాజెక్ట్ మేనేజర్ కేథరిన్ వాంగ్ ఒకరు.
ఆమె చాలా కాలంగా గూగుల్ సంస్థలో పని చేస్తున్నారు. ఎన్నో ప్రాజెక్ట్ ల్లో ఆమె కీలకంగా వ్యవహరించారు. ముందు రోజు తన పనికి ప్రశంసలు దక్కాయి.. తర్వాత రోజు టెర్మినేషన్ ఈమెయిల్ రావడంతో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ప్రస్తుత ఆమె గర్భవతి.. ఈ సమయంలో ఆమెను ఉద్యోగం నుంచి తీసేయడంతో కొత్త జాబ్లో జాయిన్ అవ్వడానికి కష్టంగా మారిందని.. అలాగే కొత్త జాబ్ లో జాయిన్ అయిన వెంటనే తనకు ప్రసూతి సెలవులు ఎలా లభిస్తాయి అని ఆమె సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది.
చాలా మంది ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో గూగుల్ పై విమర్శలు చేస్తున్నారు. మానవత్వం లేకుండా గూగుల్ సంస్థ యాజమాన్యం వ్యవహరిస్తున్నారని, గూగుల్ కి ఇది న్యాయం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె విషయంలో గూగుల్ యాజమాన్యం వారు నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటారా అనేది చూడాలి.