Ravichandran Ashwin : గుడ్ న్యూస్.. కరోనా నుండి కోలుకున్న స్టార్ స్పిన్నర్.. నేడు ఇంగ్లండ్ వెళ్లే ఛాన్స్
NQ Staff - June 22, 2022 / 01:47 PM IST

Ravichandran Ashwin : కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. జులై 1 నుంచి బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టుని భారత్ జట్టు ఆడనుండగా.. గత వారమే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు టెస్టు టీమ్‌లోని ప్రధాన ఆటగాళ్లందరూ అక్కడికి చేరుకున్నారు. కానీ.. ఇటీవల కరోనా బారిన పడిన అశ్విన్ మాత్రం.. టెస్టు టీమ్‌తో కలిసి ఇంగ్లాండ్‌కి వెళ్లలేకపోయాడు.
గుడ్ న్యూస్..
తాజాగా అశ్విన్‌కు కోవిడ్ నెగిటివ్ రిపోర్టు రావడంతో ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు లండన్‌కు బయల్దేరనున్నాడని సమాచారం. అతను ఇవాళే లండన్ ఫ్లైట్ ఎక్కనున్నాడని బీసీసీఐ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న అశ్విన్‌కు ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగిటివ్ వచ్చిందని, అతనికి ఇంగ్లండ్ వెళ్లాక మరోసారి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తారని, ఆతర్వాతే అతను టీమిండియాతో కలుస్తాడని ఆయన పేర్కొన్నారు.
అయితే అశ్విన్ ఈ నెల 24 నుంచి లీసెస్టర్‌షైర్‌తో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లో పాల్గొనే అవకాశం మాత్రం లేదని ఆయన వివరించారు. కాగా, ఐపీఎల్ ముగిశాక తమిళనాడు క్రికెట్ సంఘం నిర్వహించిన స్థానిక లీగ్‌లో పాల్గొన్న సందర్భంగా అశ్విన్ కోవిడ్ బారిన పడ్డాడు.
బెంగళూరు టీ20 మ్యాచ్ వర్షం వల్ల రద్దయిన మరుసటి రోజు తెల్లవారు జామునే ద్రవిడ్‌తో పాటు రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ లండన్ విమానం ఎక్కారు. . కాగా- హార్దిక్ పాండ్యా కేప్టెన్సీలో మరో జట్టు గురువారం ఐర్లాండ్‌కు బయలుదేరి వెళ్తుంది. ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. ఈ జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా అపాయింట్ అయ్యాడు.

Ravichandran Ashwin Playing Test Match Against England
జులై 1వ తేదీన తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభమౌతుంది. లీసెస్టర్‌షైర్‌లో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఇది రీషెడ్యూల్డ్ మ్యాచ్. గతంలో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు కరోనా వైరస్ వల్ల వాయిదా పడిన అయిదో టెస్ట్ మ్యాచ్ ఇది. ఇప్పుడు మళ్లీ ఈ మ్యాచ్‌ను ఆడనున్నాయి ఈ రెండుజట్లు.
దీని తరువాత మూడు టీ20లు, రెండు వన్డే ఇంటర్నేషనల్స్‌లో తలపడనున్నాయి. తొలి టీ20 మ్యాచ్ వచ్చేనెల 7వ తేదీన షెడ్యూల్ అయింది. ఏజెస్ బౌల్ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. 9, 10వ తేదీల్లో ఎడ్జ్‌బాస్టన్, ట్రెంట్ బ్రిడ్జ్‌ల్లో మిగిలిన రెండు టీ20 ఇంటర్నేషనల్స్ ఉంటాయి.