Godfather Review: గాడ్ ఫాదర్ రివ్యూ: మెగాస్టార్ చిరంజీవి ఈజ్ బ్యాక్.!

NQ Staff - October 5, 2022 / 08:01 AM IST

Godfather Review: గాడ్ ఫాదర్ రివ్యూ: మెగాస్టార్ చిరంజీవి ఈజ్ బ్యాక్.!

Godfather Review: ‘ఆచార్య’ వంటి డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుంచి వస్తోన్న సినిమా అనగానే ‘గాడ్ ఫాదర్’ మీద అంచనాలు పెరిగాయ్. అయితే, హీరోయిన్ లేకపోవడం.. చిరంజీవికి డాన్సులు చేసే స్కోప్ తక్కువగా వుండడం. పవర్‌ఫుల్ రోల్‌ని అండర్ ప్లే చేయాల్సి రావడం.. ఇలా చిరంజీవి ఈ రీమేక్‌తో ఎలా మెప్పిస్తారు.? అన్న చర్చ అంతటా జరిగింది. మారిన సినిమా సమీకరణాల నేపథ్యంలో ‘గాడ్ ఫాదర్’ మీద ఓ వైపు అంచనాలు, ఇంకో వైపు అనుమానాలు పెరిగాయ్. ఇంతకీ, ‘గాడ్ ఫాదర్’ కథా కమామిషు ఏంటి.? ఒరిజినల్‌తో పోల్చితే జరిగిన మార్పులెలా సినిమాకి ఉపయోగపడ్డాయ్.? అది తెలుసుకోవాలంటే కథలోకి వెళ్ళిపోవాలి కదా.!

కథ

ముఖ్యమంత్రి హఠాన్మరణంలో పార్టీలో ముఖ్య నేతల అసలు రంగులు బయటపడతాయి. ఫండింగ్ పేరుతో పార్టీనీ, ప్రభుత్వాన్నీ పక్కదారి పట్టించే ప్రయత్నాలు, ఈ క్రమంలో దివంగత ముఖ్యమంత్రి తనయుడు అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టాల్సి వస్తే.. ఆ దివంగత ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన ఓ ‘మెగా పవర్’ రంగంలోకి దిగి, పార్టీనీ.. ప్రభుత్వాన్నీ, రాష్ట్రాన్ని కాపాడటమే ఈ ‘గాడ్ ఫాదర్’ సినిమా కథ.

నటీనటుల పనితీరు..

150 ప్లస్ సినిమాలు చేసిన మెగాస్టార్ చిరంజీవి చాలా బాగా నటించారు.. అని ఇప్పుడు కొత్తగా చెప్పడంలో అర్థం లేదు. ఈ సినిమా కోసం నటుడిగా చిరంజీవి ప్రాణం పెట్టేశారు. డాన్సులు చేసే అవకాశం రాకపోవడం, తనదైన టైమింగ్‌తో కూడిన కామెడీ చెయ్యకపోవడం.. వీటిని అస్సలు పట్టించుకోలేదు. జస్ట్, పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారంతే. వన్ మ్యాన్ షో అనడం అతిశయోక్తి కాదు.

చిరంజీవి తర్వాత నటుడిగా ఈ సినిమా కోసం ప్రాణం పెట్టింది సత్యదేవ్. ఎందుకు చిరంజీవి, సత్యదేవ్‌ని ఎంచుకున్నారో తెరపై సత్యదేవ్‌ని చూస్తే అర్థమవుతుంది. నయనతారకు తెరపై దక్కిన నిడివి తక్కువే అయినా, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ సమ్‌థింగ్ స్పెషల్.

సునీల్, మురళీ శర్మ, ఇలా సినిమాలోని ఇతర ప్రధాన తారాగణమంతా తమ పాత్రల పరిధి మేర బాగానే చేశారు. సల్మాన్ ఖాన్ స్పెషల్ ప్యాకేజీ.

సాంకేతిక నిపుణులెలా పని చేశారంటే..

సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ పెర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి. మాటలు బాగున్నాయి. ఎడిటింగ్ క్రిస్పీగానే వున్నా, ఇంకాస్త క్రిస్పీగా వుంటే బావుండనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఫస్టాఫ్ బిగినింగ్‌లో కొంతసేపు, సెకెండాఫ్ ప్రీ క్లయిమాక్స్ విషయంలోనూ ఎడిటింగ్ ఇంకాస్త పదును చూపించి వుంటే బావుండేది.

ప్లస్ పాయింట్స్…

  • మెగాస్టార్ చిరంజీవి
  • సత్యదేవ్
  • రేసీ స్క్రీన్‌ప్లే
  • తమన్ బీజీఎం

మైనస్ పాయింట్స్..

  • సెకెండాఫ్‌లో కొంత సాగదీత

విశ్లేషణ..

మలయాళ ‘లూసిఫర్’ని యాజిటీజ్‌గా దించెయ్యాలనుకోలేదు. కోర్ కథ అలాగే వుంచుతూ, చిన్న చిన్న మార్పులు తెలుగు నేటివిటీకి అనుగుణంగా చేశారు. మెగాస్టార్ ఇమేజ్‌కి తగ్గట్టుగా జరిగిన ఆ మార్పులు ఆయన అభిమానుల్ని అలరిస్తాయి. ఎంటర్టైన్మెంట్, గ్లామర్, హీరోయిన్‌తో హీరో రొమాన్స్.. ఇవి లేకపోవడంతో ఓ వర్గం ఆడియన్స్ ఎంతవరకు ఈ సినిమాతో ఎంతవరకు కనెక్ట్ అవుతారన్నది వేచి చూడాలి. ఓవరాల్‌గా దర్శకుడు మోహన్ రాజా దాదాపు ఇరవయ్యేళ్ళ తర్వాత తెలుగు తెరపైకి రీ-ఎంట్రీ ఘనంగానే ఇచ్చినట్లయ్యింది. మెగాస్టార్ ఈజ్ బ్యాక్ అని అభిమానులూ ఉత్సాహపడేలానే వుంది సినిమా. ‘లూసిఫర్’ చూడనివాళ్ళకి ఈ సినిమా పండగే. చూసినవాళ్ళకి ‘ఓకే.. బెటర్’ అనిపిస్తుంది.

రేటింగ్: 2.75/5

Read Today's Latest సినిమా రివ్యూలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us