Bro Movie Review : ‘బ్రో’ మూవీ రివ్యూ.. మెగా ఫ్యాన్స్ కి కన్నుల విందు
NQ Staff - July 28, 2023 / 06:40 AM IST

Bro Movie Review : రాజకీయాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ సినిమాలను మాత్రం వీడటం లేడు. తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేస్తూ దూసుకు పోతున్న పవన్ ఈసారి ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా లో సాయి ధరమ్ తేజ్ తో మొదటి సారి పవన్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. పవన్ 25 రోజులు మాత్రమే ఈ సినిమా కోసం వర్క్ చేశాడు. తమిళ హిట్ మూవీ వినోదయ సీతం కు రీమేక్ గా రూపొందిన ఈ సినిమా ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
మార్కండేయులు (సాయి ధరమ్ తేజ్) చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో కుటుంబ బాధ్యతను నెత్తిన వేసుకుంటాడు. ఇద్దరు సోదరీమణులను ఒక సోదరుడిని కష్టపడి పెంచుతాడు. మార్కండేయులు అంటే ఇంట్లో వారికి, అతడు పని చేసే చోట కూడా చాలా ఇష్టపడుతూ ఉంటాడు. కానీ వారిపై తన ప్రేమను చూపించేంత సమయం అతడికి ఉండదు. బిజీ బిజీగా సాగుతున్న అతడి లైఫ్ ను ఒక యాక్సిడెంట్ టర్న్ చేసింది. ఆ యాక్సిడెంట్ తో అతడి జీవితం ముగుస్తుంది. అయితే అనూహ్యంగా అతడికి కాలం(పవన్ కళ్యాణ్) మద్దతుగా నిలుస్తాడు. మార్కండేయ 90 రోజుల పాటు తిరిగి తన జీవితాన్ని పొందుతాడు. ఆ సమయంలో ఏం చేస్తాడు? అసలు ఆ 90 రోజులు ఎలా వస్తాయి అనేది కథ.
నటీనటుల నటన :
పవన్ కళ్యాణ్ గతంలో గోపాల గోపాల సినిమాలో దేవుడి పాత్రలో ఎలా కనిపించాడో, ఎలా నటించాడో అలాగే ఈ సినిమాలో కూడా కనిపించి మెప్పించాడు. నిజంగా దేవుడు ఇలాగే ఉంటాడేమో అన్నట్లుగా అభిమానులు భావించేంత కూల్ గా పవన్ ఈ సినిమాలో కనిపించాడు. టైమ్ కు ప్రాణం ఉంటే పవన్ కళ్యాణ్ మాదిరిగా కూల్ గా మంచిగా ఉంటుందా అంటూ కూడా అనుకునే విధంగా పవన్ కళ్యాణ్ తన నటనతో మెప్పించాడు. సాయి ధరమ్ తేజ్ తో ఆయన కాంబో సన్నివేశాలు ఫ్యాన్స్ కు ఆనందాన్ని కలిగించాయి.
సాయి ధరమ్ తేజ్ మంచి నటనతో మెప్పించాడు. పవన్ ముందు ఆయన నటన కనిపించక పోవచ్చు. కానీ మార్కండేయ పాత్ర కు తేజ్ పూర్తి న్యాయం చేశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. హీరోగా సాయి ధరమ్ తేజ్ పవన్ తో పోటీ పడి కొన్ని సన్నివేశాల్లో నటించేందుకు ప్రయత్నించాడు. డాన్స్ లో కూడా మెప్పించాడు. కేతిక శర్మ అందంతో ఆకట్టుకుంది. ఇక ప్రియా ప్రకాష్ వారియర్ కి పెద్దగా నటించే స్కోప్ దక్కలేదు. మిగిలిన వారు పర్వాలేదు అన్నట్లుగా నటించారు.
టెక్నికల్ గా ఎలా ఉందంటే :
రీమేక్ సినిమా అవ్వడంతో దర్శకుడు సముద్రఖని ఎక్కువ కష్టపడాల్సిన అవసరం రాలేదు. చాలా మార్పులు చేర్పులు చేశాం అంటూ మొదటి నుండి చెప్పారు. ఆ మార్పుల వల్ల సినిమా ఇబ్బంది పెట్టింది. థమన్ అందించిన పాటలు కొన్ని చోట్ల బలవంతంగా ఇరికించినట్లుగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సన్నివేశాల్లో కెమెరా వర్క్ చాలా బాగా వచ్చింది. దర్శకుడు కమర్షియల్ ఎలిమెంట్స్ ను జొప్పించేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. స్క్రీన్ ప్లే విషయంలో కూడా కాస్త గందరగోళంగా ఉంది. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ లో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
పవన్ కళ్యాణ్,
పవన్ హిట్ సాంగ్స్ సన్నివేశం,
ఫస్ట్ హాఫ్ సన్నివేశాలు
రన్ టైమ్ తక్కువగా ఉండటం
మైనస్ పాయింట్స్ :
కథ చాలా స్లోగా ఉండటం,
కొన్ని ఫ్యాన్స్ స్పెషల్ సీన్స్,
ఒరిజినల్ ఫ్లేవర్ ను మిస్ చేశారు.
విశ్లేషణ :
వినోదయ సితం సినిమా కి బ్రో రీమేక్ అనే విషయం తెల్సిందే. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా చాలా మార్పులు చేర్పులు చేశాం అంటూ యూనిట్ సభ్యులు చెబుతూ వచ్చారు. అయితే ఆ మార్పులు మరీ ఎక్కువ అయ్యాయి. ఒరిజినల్ కథ సోల్‌మిస్ అయినట్లుగా అనిపిస్తుంది. ముఖ్యంగా చాలా సన్నివేశాల్లో పాటలు, అనవసర కమర్షియల్ ఎలిమెంట్స్ ను జొప్పించే ప్రయత్నం చేయడం వల్ల సోల్ మిస్ అయింది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగ్గట్లుగా ఉండాలనే ఉద్దేశ్యంతో అనవసర సన్నివేశాలను పెట్టేందుకు ప్రయత్నించారు. అంతే కాకుండా ఈ సినిమాలో పొలిటికల్ డైలాగ్స్ ను, పంచ్ డైలాగ్స్ ను కూడా పెట్టడం మరీ విడ్డూరం. ‘బ్రో’ సినిమాలో ఇద్దరు మెగా హీరోలు కనిపించడంతో పాటు, ఫ్యాన్స్ కోసం అన్నట్లుగా కొన్ని సన్నివేశాలు ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. దాంతో ఈ సినిమా ఫ్యాన్స్ కు కన్నుల విందు చేస్తుంది. కానీ సామన్య ప్రేక్షకుల మాత్రం అంతగా ఎక్కక పోవచ్చు.
చివరగా :
మెగా ఫ్యాన్స్ కు మంచి వినోదాన్ని ఇస్తుంది ‘బ్రో’.
రేటింగ్ : 2.5/5.0