KCR : కేసీయార్‌తో ఉండవల్లి భేటీ.! ఏం జరుగుతోందబ్బా.?
NQ Staff - June 13, 2022 / 07:31 PM IST

KCR : ఒకరేమో సమైక్యవాది.. ఇంకొకరేమో తెలంగాణ వాది.! ఇద్దరి కలయికా చోటు చేసుకుందంటే, తెరవెనుకాల పెద్ద కథే నడచి వుండాలి. ఆ సమైక్యవాది పేరు ఉండవల్లి అరుణ్ కుమార్. ఆయన మాజీ ఎంపీ. గతంలో కాంగ్రెస్ నేత. ఇప్పుడు ఏ పార్టీలోనూ లేరు. అసలు రాజకీయాల్లోనే యాక్టివ్‌గా లేరు. కానీ, ‘మేధావి వర్గం’ లిస్టులోకి వెళ్ళిపోయి, తరచూ మీడియా ముందుకొస్తుంటారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో తాజాగా భేటీ అయ్యారు ఉండవల్లి అరుణ్ కుమార్. సహజంగానే ఈ కలయికపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది, జరుగుతోంది కూడా.! జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో ఉండవల్లి భేటీ ఎందుకయ్యారన్నది చర్చనీయాంశంగా మారింది.
KCR: రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ :
కేసీయార్, రాజకీయ వ్యూహాలు రచించడంలో దిట్ట. ఆయన మేధో సంపత్తి గురించి కొత్తగా చెప్పేదేముంది.? అయినాగానీ, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వ్యక్తుల దగ్గర మరింత సమాచారం వుంటుందని బహుశా కేసీయార్ భావించి వుండొచ్చు. లేదా, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాల గురించీ, దేశంలో రాజకీయాల గురించీ ఉండవల్లి నుంచి కొన్ని ఇన్‌పుట్స్ తీసుకోవాలని కేసీయార్ అనుకుని వుండొచ్చు.

Why KCR Undavalli Arun Kumar Meet Topic Discussion
ఇవేవీ కావు, జాతీయ పార్టీ గనుక స్థాపిస్తే, ఆ పార్టీలో చేరాలని ఉండవల్లికి కేసీయార్ ఆహ్వానం కూడా ఈ సందర్భంగా పలికి వుండొచ్చుగాక.! కానీ, సమైక్య వాదితో కేసీయార్ భేటీ అవడమేంటి.? అంటూ తెలంగాణ సమాజంలో అలజడి రేగకుండా వుంటుందా.?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విభజన వాదం, తెలంగాణ వాదం, సమైక్య వాదం అన్న ప్రస్తావనలే అనవసరమని బహుశా కేసీయార్ అనుకుంటున్నారేమో. అందుకే అందరూ కలిసి వుండాలనే ఆలోచనతో వ్యవహరిస్తున్నారేమో.!