Vani Devi : వాణీదేవికి రోజురోజుకీ పెరుగుతున్న మద్దతు

Vani Devi : హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో అధికార పార్టీ టీఆరెస్ తరఫున పోటీ చేస్తున్న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె S. వాణీదేవికి రోజురోజుకీ జనం నుంచి మద్దతు పెరుగుతోంది. వివిధ ప్రజా, కుల సంఘాలు ఆమెకు సపోర్ట్ ప్రకటిస్తున్నాయి. టీఆరెస్ పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తామని గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్ల సంఘం (జీజేఎల్ఏ) సోమవారమే తేల్చిచెప్పింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు డాక్టర్ పి.మధుసూదన్ రెడ్డి ప్రకటన చేశారు. మరో వైపు.. వడ్డెర సంఘం కూడా గులాబీ పార్టీకే జైకొట్టింది. ఈ మేరకు రెండు రోజుల కిందట తీర్మానం చేశారు. పేదలతోపాటు అన్ని వర్గాల ప్రజల కోసం వివిధ సంక్షేమ కార్యక్రమాలను, పథకాలను అమలుచేస్తున్న సీఎం కేసీఆర్ వెంటే తాము ఉంటామని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి అయిలమల్లు తెలిపారు.

సిటీ లైబ్రరీ..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆరెస్ పార్టీ క్యాండిడేట్, విద్యావేత్త వాణీదేవికే తమ ఓటు అని హైదరాబాద్ సిటీ లైబ్రరీ చైర్ పర్సన్ ప్రసన్న మూర్తి తెలిపారు. గ్రంథాలయానికి రోజువారీ వచ్చే పాఠకులు, పట్టభద్రులు, విద్యార్థులు సైతం ఈ విషయాన్నే వెల్లడించారు. ఉస్మానియా జేఏసీ అధ్యక్షుడు బండారు వీరబాబు టీఆరెస్ పార్టీకే మద్దతు తెలిపారు. పట్టభద్రుల, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే సత్తా అధికార పార్టీకే ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అడకుండానే పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారని, ఇప్పటికే లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశారని చెప్పారు. ఎలక్షన్ కోడ్ ముగిశాక 50 వేలకుపైగా జాబుల రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్లు విడుదల చేస్తారని, ఈ విషయాన్ని నిరుద్యోగులు ప్రతిఒక్కరూ దృష్టిలో పెట్టుకొని ధైర్యంగా ఉండాలని సూచించారు.

Vani Devi : trs mlc candidate gaining support from various associations
Vani Devi : trs mlc candidate gaining support from various associations

గెస్ట్ లెక్చరర్లు: Vani Devi

టీఆరెస్ పార్టీ అభ్యర్థులకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని రాష్ట్ర జూనియర్ కాలేజీల గెస్ట్ లెక్చరర్ల సంఘం ప్రకటించింది. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దామెర ప్రభాకర్, దార్ల భాస్కర్ ఈ మేరకు స్టేట్మెంట్ ఇచ్చారు. వాణీదేవికి పలు బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు సపోర్ట్ గా నిలిచారు. బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గంగు ఉపేంద్ర శర్మ, బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పోచంపల్లి రమణారావు, బ్రాహ్మణ సమాఖ్య, నియోగి బ్రాహ్మణ సంఘం నాయకులు కూడా వాణీదేవిని కలిసి ఈ మేరకు హామీ ఇచ్చారు. నాయీ బ్రాహ్మణ సంఘం, తెలంగాణ వీరభద్రీయ కుల సంఘం, న్యాయవాదులు తదితరులు వాణీదేవికి సపోర్ట్ తెలిపారు.

Advertisement