తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకోని రావటమే తన లక్ష్యమని చెపుతున్న వైఎస్ షర్మిల ఆ దిశగా రాజకీయ పార్టీని స్థాపించటానికి చకచకా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా తెలంగాణలోని ఉమ్మడి జిల్లా నేతలతో వరసగా సమావేశాలు నిర్వహిస్తూ కార్యాచరణ సిద్ధం చేసుకుంటుంది.
షర్మిల కొత్త పార్టీ వెనక బీజేపీ ఉందని.. బీజేపీ షర్మిలను నడిపిస్తూ రెడ్ల ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తోందని.. కొందరు ఆరోపిస్తుంటే.. మరి కొందరు మాత్రం ఆమె కొత్త పార్టీ వెనక సీఎం కేసీఆర్ ఉన్నారని… మరి కొన్ని చర్చలు నడుస్తున్నాయి. షర్మిల ఆంధ్రా నాయకురాలు అని కొందరు విమర్శలు చేస్తుంటే.. ఆమె మాత్రం తాను తెలంగాణ కోడలిని అని .. తనకు ఇక్కడ పార్టీ పెట్టే హక్కు ఉందని చెప్పడంతో పాటు తాను ఇక్కడ రాజన్న రాజ్యం తెస్తానని చెపుతున్నారు.
గతంలో వైఎస్ హయాంలో ఒక వెలుగు వెలిగిన నేతలందరూ ఇప్పుడు వరసపెట్టి షర్మిలను కలుస్తూ తమ తమ మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఖమ్మం నేతల నుండి ఆమెకు గట్టి మద్దతు వస్తున్నట్లు సమాచారం. దీనితో ఆమె ఖమ్మం పర్యటన చేయాలనీ ప్లాన్ చేసింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఆ పర్యటన రద్దు అయ్యింది.
ఇదిలా ఉంటే అధికార టీఆర్ఎస్కు చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడు షర్మిలతో భేటీ కావడం స ర్వత్రా చర్చకు దారితీసింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కాలే యాదయ్య కుమారుడు కాలే రవికాంత్.. షర్మిలతో లోటస్ పాండ్లో భేటీ అయ్యి కొద్ది సేపు చర్చించారు. అయితే వీరిద్దరి భేటీ కి కారణం ఏంటన్నది మాత్రం తెలియదు. అధికార పార్టీ ఎమ్మెల్యే తనయుడు అయ్యి ఉండి కూడా రవికాంత్ షర్మిలను ఎందుకు కలిశారు ? ఈ భేటీ వెనక రాజకీయ కోణం ఉందా ? లేదా మరేదైనా కోణం ఉందా ? అన్నది మాత్రం తెలియదు.
ఈ కలయిక తెరాస వర్గాల్లో కలవరం పుట్టించింది. రవికాంత్ ఒక్కడేనా లేక ఇలాంటి నేతలు ఇంకెంత మంది షర్మిల తో టచ్ లో వున్నారు అనే అనుమానం ఆ పార్టీ వర్గాల్లో మొదలైంది. ఇప్పటికే బ్రదర్ షఫీ షర్మిల కి మద్దతు ప్రకటించాడు. ప్రజా గాయకుడు గద్దర్ కూడా షర్మిల వైపు ఉన్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. వీటిని గమనిస్తే ఒక పక్క వ్యూహం ప్రకారమే షర్మిల తెలంగాణ రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నట్లు తెలుస్తుంది.