గంటా సరికొత్త రాజకీయం.. విశాఖ టు తిరుపతి

PBN - March 14, 2021 / 11:48 AM IST

గంటా సరికొత్త రాజకీయం.. విశాఖ టు తిరుపతి

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజకీయంగా మేధావి అనే చెప్పాలి. రానున్న పరిస్థితులను పసిగట్టి అందుకు తగ్గట్లు తనను తాను మలుచుకునే స్వభావం ఆయన సొంతం. అలాంటి గంటాకు గత ఎన్నికల్లో లెక్క తప్పింది. టీడీపీ ఘోర ఓటమి తర్వాత చాలా రోజులు ఎలాంటి చలనం లేకుండా ఉండిపోయిన ఆయన, వైసీపీ లోకి వెళ్ళటానికి గట్టిగానే ప్రయత్నాలు చేసిన కానీ ఫలితం లేకపోవటంతో మౌనంగా ఉండిపోయాడు.

ganta srinivas rao

ఇలాంటి సమయంలో విశాఖ ఉక్కు సమస్య రావటంతో అందరికంటే ముందుగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఉద్యమంలో హీరోగా మారిపోయాడు. ఇంతటితో ఆగకుండా అధికార వైసీపీ పార్టీని కార్నర్ చేసే విధంగా వ్యూహాలు రచిస్తూ ముందుకు వెళ్తున్నాడు గంటా ఈ క్ర‌మంలో విశాఖ ఉక్కు సెంటిమెంట్‌ను తిరుప‌తి ఉప ఎన్నిక‌లో ర‌గిల్చి త‌ద్వారా టీడీపీకి ప్ర‌యోజ‌నం క‌లిగించే స‌రికొత్త ఎత్తుగ‌డ‌కు శ్రీ‌కారం చుట్టిన విష‌యం శ‌నివారం బ‌య‌ట ప‌డింది. తిరుప‌తిలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ … తిరుప‌తి ఉప ఎన్నిక‌లో విశాఖ ఉక్కు ప్ర‌యివేటీక‌ర‌ణ వ్య‌తిరేక ఉద్య‌మం త‌ర‌పున ఎంపీ అభ్య‌ర్థిని నిల‌బెట్టే అంశంపై అఖిల‌ప‌క్షంతో చ‌ర్చిస్తా మ‌న్నారు.

ఎటూ విశాఖ ఉక్కు ఉద్య‌మంలో వామ‌పక్ష పార్టీల అనుబంధ కార్మిక సంస్థ‌లు క్రియాశీల‌కంగా ఉన్నాయి. టీడీపీతో సీపీఐ ఇప్ప‌టికే పొత్తు కుదుర్చుకున్న సంగ‌తి తెలిసిందే. గంటా చెబుతున్న‌ట్టు అఖిల‌ప‌క్షం త‌ర‌పున అభ్య‌ర్థి అంటే టీడీపీ -సీపీఐ కూట‌మి అభ్య‌ర్థే అని అర్థం చేసుకోవాలి. పేరుకు అఖిల‌ప‌క్షం …ప్ర‌యోజ‌నాలు మాత్రం టీడీపీ ప‌క్షం అనే రీతిలో గంటా పావులు క‌దుపుతున్నారు. అయితే గంటాను ముందుకు పెట్టి చంద్ర‌బాబు ఆడిస్తున్న ఆట‌గా రాజ‌కీయ ప‌రిశీల‌కులు అభివ‌ర్ణిస్తున్నారు.

ఒక వేళా అఖిలపక్షము నిలబెట్టే అభ్యర్థికి ఓటు వేయకపోతే వాళ్ళు ఏపీ ద్రోహులు అనే సెంటిమెంట్ లేవనెత్తే అవకాశం కూడా లేకపోలేదు. దీనిని బట్టి చూస్తే నిన్న మొన్నటి దాక వైసీపీ గూటిలోకి దూకడానికి చూసిన గంటాకు అక్కడ అవకాశం లభించకపోవటంతో తిరిగి టీడీపీ లోనే తన మార్క్ రాజకీయాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us