Telangana : మూడు పార్టీలు.. ఒకే ఒక్క డిమాండ్..

Telangana తెలంగాణ రాష్ట్రంలో మూడు పార్టీలు ఒకే ఒక్క డిమాండ్ చేస్తున్నాయి. కరోనా చికిత్సను ‘ఆరోగ్య శ్రీ’ పథకంలో చేర్చాలని కోరుతున్నాయి. ఈ మేరకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులు, దాంతోపాటే బీజేపీ నేతలు, మరో వైపు వైఎస్ షర్మిల ఇదే అంశాన్ని నొక్కి చెబుతున్నారు. ప్రస్తుతం కొవిడ్-19 వైరస్ విపరీత వ్యాప్తి నేపథ్యంలో పేదలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ పొందలేకపోతున్నారని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలనే డిమాండ్ తో హస్తం పార్టీ ఎమ్మెల్యే సీతక్క, ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ తదితరులు నిన్న దీక్ష చేసిన విషయం తెలిసిందే. దీనికి కేసీఆర్ సర్కారు స్పందించి తగిన నిర్ణయం తీసుకోవాలని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. కొరత పేరుతో హాస్పిటల్స్ మందుల రేట్లను భారీగా పెంచాయని తప్పుపట్టారు.

షర్మిల ఫైర్..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై వైఎస్ షర్మిల నిన్న మంగళవారం ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ కి ప్రశ్నించేవాళ్లు నచ్చరని, అలాంటి వ్యక్తి ఒక మహిళ పోరాటం చేస్తుంటే సహించగలడా అని అన్నారు. సీతక్క దీక్షను పోలీసులు భగ్నం చేయటాన్ని షర్మిల ఖండించారు. డిమాండ్ పరిష్కారానికి చొరవ చూపని గవర్నమెంట్.. దీక్షలను బలవంతంగా చెదరగొట్టడం పైన మాత్రం ఉత్సాహం ప్రదర్శిస్తుందని ఎద్దేవా చేశారు. మహిళా వ్యతిరేకిగా పాలన సాగిస్తున్న కేసీఆర్ కి భవిష్యత్తులో ఆ మహిళా ఉద్యమాలే బుద్ధిచెబుతాయని షర్మిల హెచ్చరించారు.

మంత్రులు ఎందుకు టీకా వేయించుకోలేదు?..

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు ఇప్పటివరకు కరోనా టీకాని ఎందుకు వేయించుకోలేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. వ్యాక్సిన్ తీసుకోనివారు ప్రజల్లో నమ్మకాన్ని ఎలా కలిగిస్తారని నిలదీశారు. కష్ట కాలంలో జనానికి భరోనా కల్పించని సీఎం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని బండి సంజయ్ ఘాటుగా విమర్శించారు. కొవిడ్-19 విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టే మంత్రులు నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. కరోనా కంట్రోల్ కోసం ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేయలేకపోతోందని వేలెత్తి చూపారు. కొవిడ్-19 వైరస్ ఇంతలా వ్యాపించటానికి ఎన్నికలే ముఖ్య కారణమని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.

Advertisement