హైదరాబాద్: తెలంగాణ రైతులకు వ్యవసాయ శాఖ ఒక తీపి వార్తను వెల్లడించింది. రైతు భీమా పథకం కింద రూ. 1141 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయసు గల రైతులకు జీవిత భీమా కలిపించేందుకు ప్రీమియంగా ఈ డబ్బులు చెల్లించనుంది. గత ఏడాది ఆగస్టు 14 నుండి ఈ సంవత్సరం 13 వరకు 33 లక్షల మంది రైతులు లబ్దిపొందుతున్నారు. త్వరలో ఈ గడువు ముగియనుండటంతో మరో ఏడాదికి ఎల్ఐసీకు ప్రీమియంగా జీవిత భీమా ప్రీమియంగా చెల్లించడానికి కేటాయించింది. గత ఏడాది రూ.908.30 కోట్ల చెల్లించగా, ఈ ఏడాది రూ. 233 కోట్లు అదనంగా ప్రభుత్వం కేటాయించింది.
రైతు భీమా పథకంకు అర్హత పొందాలంటే ధరణి వెబ్ సైట్ లో పేరు నమోదు చేసుకొని ఉండాలి. అయితే జనవరి 29న ధరణి వెబ్ సైట్ ను సర్వర్ ను నిలిపివేశారు. ఈనెల 13 నుండి మళ్ళీ నూతన అర్హులను నమోదు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకంలో నమోదైన రైతులు చనిపోతే 10 రోజుల్లో రూ. 5లక్షలను ఎల్ఐసీ సంస్థ ఇవ్వనుంది. గతేడాది రాష్ట్రంలో 14,000 మంది రైతులు మరణించడంతో వారిలో దాదాపు అందరికి డబ్బులను ఆ సంస్థ అందజేసింది.