బ్రేకింగ్ న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి రాత్రి 9 గంటలకే అంతా బంద్

Curfew తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి పూట 9 గంటల నుంచి ఉదయం పూట 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం ఈ రోజు మంగళవారం రాత్రి నుంచే అమల్లోకి వస్తుందని, ఈ నెలాఖరు వరకు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం ఉదయం ఉత్తర్వులు విడుదల చేసింది. అయితే ఈ కర్ఫ్యూ.. హాస్పిటల్స్, ఫార్మసీలు, డయాగ్నోస్టిక్ ల్యాబ్ లకు, ప్రింట్-ఎలక్ట్రానిక్ మీడియా, పెట్రోల్ బంక్ లు, ఐటీ సేవలకు వర్తించదని పేర్కొంది. ఆఫీసులు, షాపులు, హోటళ్లు, థియేటర్లు, బార్లను రాత్రి ఎనిమిది గంటలకే బంద్ చేయాలని ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్-19 సెకండ్ వేవ్ సైలెంట్ గా, స్పీడ్ గా విస్తరిస్తోంది. రోజుకి ఐదారు వేల కేసులు నమోదవుతున్నాయి. సీఎం కేసీఆర్ కి సైతం ఇది పాజిటివ్ అని వచ్చింది. నిన్న సోమవారం కరోనా కారణంగా ఏకంగా 18 మంది చనిపోయారు. హైదరాబాద్ లో 800 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి రోజువారీ మరణాలు ఎక్కువ చోటుచేసుకుంటూ ఉండటం ఆందోళనకరంగా మారింది.

బస్సులు నడుస్తాయ్..

కోల్డ్ స్టోరేజ్ లు, వేర్ హౌజింగ్, విద్యుత్ సేవలు ఎప్పటిమాదిరిగానే నడుస్తాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. స్థానిక, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఎలాంటి మార్పులు చేర్పులు లేవని స్పష్టం చేసింది. ఈ-కామర్స్ ద్వారా జరిగే గూడ్స్ డెలివరీలకు, రెగ్యులర్ గా నడిచే గ్యాస్ డెలివరీలకు, వాటర్ సప్టై, శానిటేషన్, ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసులు, ప్రొడక్షన్ యూనిట్లు, సర్వీసులకు కూడా మినహాయింపు ఇచ్చినట్లు ప్రభుత్వం వివరించింది. వీకెండ్ లాక్డౌన్ లేదా రాత్రి కర్ఫ్యూ ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని అమలుచేయాలని, లేకపోతే తామే ఆదేశాలు జారీచేయాల్సి వస్తుందంటూ తెలంగాణ హైకోర్టు నిన్న సీరియస్ అయిన సంగతి తెలిసిందే.

Advertisement