TDP vs YCP : వెన్నుపోటు వర్సెస్ గొడ్డలి పోటు.! టీడీపీ వర్సెస్ వైసీపీ.!
NQ Staff - October 14, 2022 / 11:05 PM IST

TDP vs YCP : ‘ఒకరి పరువుని ఇంకొకరు తీసేసుకుని, నిస్సిగ్గుగా రోడ్డున పడి కొట్టుకుంటున్నారు..’ అంటూ సోషల్ మీడియా వేదికగా అధికార వైసీపీ మీదా అలాగే ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మీదా నెటిజన్ల నుంచి సెటైర్లు పడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ‘మాయని మచ్చ’గా ‘వెన్నుపోటు’ ఎపిసోడ్ వుంటే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ‘గొడ్డలి పోటు’ కూడా అలాంటి వ్యవహారమే.! గొడ్డలి పోటుతోపాటు, పావురాల గుట్టలో హెలికాప్టర్ వ్యవహారం కూడా అధికార వైసీపీకి ఇబ్బందికరంగా మారుతోంది.
రాష్ట్ర ప్రయోజనాలు ఎవరికీ అవసరం లేదా.? వైసీపీ నేతలేమో టీడీపీకి చెందిన వెన్నుపోటు వ్యవహారంపై సెటైర్లు వేస్తున్నారు. మంత్రులు తమ శాఖల వ్యవహారాల కంటే, ఈ వెన్నుపోటు వ్యవహారంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. మూడు రాజధానుల వ్యవహారం కూడా ఈ వెన్నుపోటు వ్యవహారం ముందు చిన్నదైపోయింది వైసీపీ మంత్రులకి. తెలుగుదేశం పార్టీ సంగతి సరే సరి. అధికార పార్టీ ట్రాప్‌లో పడిపోయి, ప్రజా సమస్యలపై మాట్లాడటం మానేసింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం వంటి వ్యవహారాలపై రచ్చ చేస్తున్నారు టీడీపీ నేతలు.
టీడీపీ అనుకూల మీడియాలోనూ, వైసీపీ అనుకూల మీడియాలోనూ ఇవి తప్ప వేరే వార్తలు కనిపించకపోవడంతో రాష్ట్ర ప్రజానీకం రెండు పార్టీలనూ చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.