Nagarjuna Sagar : నాగార్జున సాగర్ లో అధికార పార్టీకి వింత పరిస్థితి.. !

Nagarjuna Sagar  తెలంగాణలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు నగారా మోగింది. దీనితో ప్రధాన పార్టీలు ఎన్నికలకు సిద్ధం అయ్యాయి. అయితే అధికార తెరాస పార్టీకి ఒక వింత పరిస్థితి వచ్చింది. సాధారణంగా బై ఎలక్షన్స్ వస్తే అధికార పార్టీకే ఎడ్జ్ ఉంటుంది. పైగా అది తెరాస సిట్టింగ్ స్థానం. అయినాకానీ తెరాస కు అభ్యర్థి దొరకటం లేదు. అంటే అసలు లేరని కాదు కానీ, అధినేత కేసీఆర్ అనుకుంటున్నా స్థాయిలో సరైన అభ్యర్థి లేరనే చెప్పాలి .


ఇప్పటివరకు ఒక్క కాంగ్రెస్ పార్టీ జానారెడ్డిని అధికారికంగా ఖరారు చేసింది తప్పితే.. విన్నర్లు..రన్నర్లు అంటూ.. హడావుడి చేసే టీఆర్ఎస్, బీజేపీలు మాత్రం ఇంత వరకూ అభ్యర్థుల్ని ఖరారు చేయలేకపోయాయి. ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే… ఆ కుటుంబసభ్యులకు టిక్కెట్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. దుబ్బాక వరకూ కేసీఆర్ అదే పాటించారు. కానీ సాగర్ విషయంలో మాత్రం.. ఆయన వ్యూహం మార్చారు. చనిపోయిన నోముల నర్సింహయ్య కుటుంబసభ్యులకు ఇవ్వదల్చుకోలేదు. ఎన్నిక కీలకం కావడంతో అనేకానేక కరసరత్తులు చేస్తున్నారు.

సాగర్ లో బలమైన నేతల కోసం… కొద్ది రోజులుగా సర్వేలు చేయిస్తున్నారు. యాదవ సామాజికవర్గానికే ఇవ్వాలని నిర్ణయించిన కేసీఆర్, మన్నే రంజిత్ యాదవ్, గురువయ్య యాదవ్ అనే ఇద్దరు నేతలకు ఫోన్లు చేసి మాట్లాడారు. వీరిలో ఒకరికి చాన్సివ్వాలా లేకపోతే.. రెడ్డి సామాజికవర్గానికి చెందిన బలమైన నేతను బరిలో నిలబెట్టాలా అన్న డైలమాలో ఉన్నారు. ఇంత వరకూ తేల్చుకోలేకపోయారు. అభ్యర్థి ఖరారు కాకపోయినాటీఆర్ఎస్ గ్రౌండ్ వర్క్ మాత్రం ఫుల్ స్వింగ్‌లో ఉంది. అభ్యర్థి లేకుండానే ఇప్పటికే అక్కడ ఒక రౌండ్ ప్రచారం పూర్తి చేశారు.

ఇదే సమయంలో బీజేపీ కూడా డైలమాలో పడింది. ఆ పార్టీకి కూడా సరైన అభ్యర్థి దొరకటం లేదు. తెరాస ఎవరైనా అభ్యర్థిని ప్రకటిస్తే అప్పుడు టిక్కెట్ దక్కని అసంతృప్తి నేతలెవరైనా తమ పార్టీలోకి వస్తారేమో వాళ్ళకి బి -ఫామ్ ఇవ్వాలని కమలదళం భావిస్తుంది. తేరా చిన్నపరెడ్డిపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే బీజేపీలో ఉన్న నేతలు.. ప్రచారాలు చేసుకుంటున్నారు. వారెవరికీ టిక్కెట్ ఇవ్వాలన్న ఆలోచనలో బీజేపీ లేదు. తొలిసారిగా టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్తుల కోసం తంటాలు పడుతూండగా.. కాంగ్రెస్ చాలా ముందుగానే రంగంలోకి దిగింది.

Advertisement