ABN : ఏబీఎన్ విషయంలో విచిత్రంగా బీజేపీ ధోరణి.. సోము వీర్రాజు గాలి తీసేసిన ఆర్కే
PBN - February 28, 2021 / 01:04 PM IST

ABN : తెలుగు రెండు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా ఏబీఎన్ న్యూస్ ఛానల్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆ ఛానల్ లో జరిగిన డిబేట్ లో అమరావతి ఉద్యమ నేత శ్రీనివాసరావు, బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డిని చెప్పుతో కొట్టిన సంఘటన తీవ్ర సంచలనంగా మారిపోయింది. దీనితో ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ పార్టీ ఏబీఎన్ ఛానల్ ను బ్యాన్ చేస్తున్నట్లు, ఇక మీదట ఎవరు కూడా ఆ ఛానల్ లో డిబేట్ కి వెళ్ళటానికి లేదని, ప్రెస్ మీట్ లకు కూడా ఆ ఛానల్ ను పిలవటానికి లేదని సోము వీర్రాజు ప్రకటించాడు.
తాజాగా ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ దీని గురించి మాట్లాడుతూ ఆంధ్రజ్యోతిని బహిష్కరిస్తున్నామని బీజేపీ నేత సోము వీర్రాజు చేసిన ప్రకటనను ఆర్కే ఎగతాళి చేశారు. అదే సమయంలో కన్నా లక్ష్మినారాయణ .. తన ప్రెస్మీట్‌కు ఆంధ్రజ్యోతిని పిలవడాన్ని గుర్తు చేసి… సోము వీర్రాజుకు పార్టీలో ఏ మాత్రం పలుకుబడి లేదని తేల్చేశారు. జగన్,చంద్రబాబు మోడీకి భయపడతారేమో కానీ తాను భయపడబోనని కూడా.. సోము వీర్రాజు మొహం మీదనే చెప్పేశారు.
బీజేపీ నేతల్లో చాలా మంది మీడియాపై నిషేధం అంటూ సోము వీర్రాజు వర్గం హడావుడి చేయడంపై అసంతృప్తిగా ఉంది. బీజేపీకి మీడియాలో వచ్చే కవరేజే అంతంత మాత్రం అయినప్పుడు… మీడియా చానళ్లను బ్యాన్ చేసి ఉన్న కవరేజీని పోగొట్టుకోవడం ఏమిటన్నదిప్రశ్న. మరోపక్క తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం ఏబీఎన్ విషయంలో చాలా సానుకూలంగా ఉన్నారు. వాళ్ళు పెట్టె ప్రెస్ మీట్ కు అందరికంటే ముందుగానే ఏబీఎన్ కు సమాచారం ఇచ్చి, కవర్ చేయమని కోరుతున్నారు.
ఏబీఎన్‌కు ఏదైనా కష్టం వస్తే.. బీజేపీ నేతలే ముందుంటున్నారు. జనగామలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి భూకబ్జాలంటూ కొంత కాలంగా ఏబీఎన్ చానల్ ప్రసారాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆయన తన అనుచరులతో దాడికి పురమాయించాడని ఏబీఎన్ ఆరోపించింది. వెంటనే బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. ముత్తిరెడ్డిపై ఆరోపణల వర్షం కురిపించారు. ఏబీఎన్‌కు అండగా ఉంటామన్నారు. ఒకే ఛానల్ గురించి ఒకే పార్టీకి చెందిన నేతలు ఈ విధంగా భిన్న అభిప్రాయాలు కలిగి ఉండటం విచిత్రం