Raghu rama-krishna-raju: ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసి ఎన్నిక‌ల‌కు వెళ్తాన‌న్న ర‌ఘురామ కృష్ణ‌రాజు

Raghu rama-krishna-raju: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గుదిబండగా మారిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు గ‌త కొద్ది రోజులుగా రాజ‌కీయాల‌లో హాట్ టాపిక్‌గా మారుతున్నారు. ఆయ‌న అధికార వైసీపీకి త్వరలోనే గుడ్ బై చెప్పేసి.. డైరెక్ట్‌గా రంగంలోకి దిగబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నెల 7వ తేదీన రఘురామ కృష్ణరాజు వైసీపీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరుతారని ఊహాగానాలు వెలువడుతున్న తరుణంలో జేపీ న‌డ్డాని క‌ల‌వ‌డం ప్ర‌ధాన్యత సంత‌రించుకుంది.

raghu ram krishna raju regrested
raghu ram krishna raju regrested

తాజాగా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తనపై అనర్హత వేటు కోసం ప్రయత్నిస్తున్నారని.. వాళ్లకు తానే సమయం ఇస్తున్నానని వైఎస్సార్‌సీపీ అధిష్టానానికి సవాల్ విసిరారు. వారంలో నిర్ణయం చెప్పాలని.. తనపై అనర్హత వేటు వేయకపోతే తానే రాజీనామా చేస్తానని చెప్పారు.

‘మా పార్టీ వాళ్లు రెండేళ్లగా ఎక్కిన గుమ్మం, దిగిన గుమ్మంతో బిజీగా ఉన్నారు. కుదిరితే స్పెషల్ ఫ్లైట్, కుదరకపోతే అందిన ఫ్లైట్‌లో తిరుగుతూ వరుసగా ఫిర్యాదులు ఇస్తున్నారు.. త్వరలోనే అనర్హత వేటు వేస్తారని సొల్లు కబుర్లు చెబుతున్నారు. నా పార్లమెంట్ సభ్యత్వం తీసేయాలని ప్రయత్నిస్తున్నారు.

వాళ్లు ఎంత వరకు విజయం సాధిస్తారో చూద్దాం. నాకు చట్టం తెలుసు, వారికి మాత్రం గౌరవం లేదు.. వారిని చూసి జాలిపడి నాకు ఆలోచన వచ్చింది’అన్నారు. ‘నేను రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లి.. ప్రజలు మా పార్టీని ఎంతగా అసహ్యించుకుంటున్నారో నిరూపిద్దామని నాకు ఆలోచన వచ్చింది. త్వరలోనే అనర్హత వేటు వేస్తారని తెలిసి ముందుగానే తెలిసి.. నేనే రాజీనామా చేయాలనుకుంటున్నట్లు ప్రచారం చేస్తున్నారు.

ఎన్ని రోజులు ఆగాలో చెబితే అన్ని రోజులు ఆగి రాజీనామా చేస్తానని చెప్పాను. నా ఛాలెంజ్‌కు వాళ్ల నుంచి స్పందన రాలేదు. రాజీనామాపై ఆలోచిస్తున్నా.. ఎప్పడు అన్నది చెబుతా. వాళ్లకు సమయం ఇచ్చా.. ఇంకా కావాలా అని సవాల్ విసురుతున్నా. ఢిల్లీలోనే ఉంటా.. ఎవరో రండీ ప్రయత్నించండి. మా వల్ల కాదంటే అప్పుడు రాజీనామా చేస్తా’అంటున్నారు రఘురామ.

Raghu rama-krishna-raju
Raghu rama-krishna-raju

తాను రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్తానని.. వైకాపాపై ఎంత వ్యతిరేకత ఉందో ఎన్నికల ద్వారా తెలియజేస్తానన్నారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదిలించేందుకు, రాజధానిగా అమరావతే కొనసాగేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు రఘురామ చెప్పారు.