తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టబోతోందని కొత్తపలుకలో వేమూరి రాధాకృష్ణ చాలా రోజుల క్రితమే చెప్పుకొచ్చాడు. ఆ వార్త వచ్చిన వెంటనే వైసీపీ నేతలు రాధాకృష్ణ మీద విరుసుకుపడ్డారు. అదే సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా రాధాకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు . రాత్రి పూట రాధాకృష్ణ కలలు కంటాడని, అవే మరుసటి రోజు అచ్చేస్తారని వ్యాఖ్యానించారు. షర్మిల పార్టీ పెడుతున్న విషయం తనకే తెలియదని, రాధాకృష్ణకు ఎలా తెలుస్తుందని వ్యాఖ్యానించారు.
ఇంతలోనే మొన్న ఫిబ్రవరి 9 షర్మిల లోటస్ పాండ్‌లో అభిమానులతో సమావేశమయ్యారు. పార్టీ పెడతానని డైరెక్ట్‌గా చెప్పకున్నా..తెలంగాణలో రాజన్న రాజ్యం లేదని, ఎందుకు లేదని వ్యాఖ్యానించారు. పరోక్షంగా పార్టీ పెడుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. అదే రోజు మధ్యాహ్నం ఓవైపు సజ్జల మాట్లాడుతూ.. కొన్నాళ్లుగా షర్మిల పార్టీకి సంబంధించి జగన్ కుటుంబీకుల్లో చర్చ నడుస్తోందని, భిన్నాభిప్రాయాలే తప్ప.. బేధాబిప్రాయాలు కాదని చెప్పారు.
షర్మిల పార్టీ గురించి రాధాకృష్ణ చెప్పింది చెప్పినట్లు జరగటంతో వైసీపీ నేతలు ఉలిక్కిపడ్డారు. గతంలో రాధాకృష్ణ కావాలనే లేనివి ఉన్నట్లు రాస్తాడని, చంద్రబాబు నాయుడు ఇలా రాయిస్తాడని వైసీపీ వాళ్ళు అనుకునేవాళ్లు, కానీ షర్మిల విషయంలో అది తప్పు అని తేలటంతో ఇప్పుడు వైసీపీ నేతలు కూడా రాధాకృష్ణ మాటలను ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు.
ఇక తనమీద విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు రాధాకృష్ణ గట్టిగానే బదులు ఇచ్చాడు విజయసాయిరెడ్డికి షర్మిల పార్టీ విషయం తెలియకపోవడానికి తాను బాధ్యుడిని కాదని, తాడేపల్లి అంతఃపురంలో రహస్యాలు చాలా తెలుసునని అన్నారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించినట్టే తనకు కల వస్తే వచ్చి ఉండవచ్చని చెప్పడంతో పాటు విజయసాయిరెడ్డి లీలల గురించి కూడా కొన్ని కలలు వచ్చాయని, అవేమిటో త్వరలోనే అందరికీ తెలుస్తాయని డైరెక్ట్‌గానే చెప్పారు రాధాకృష్ణ.
ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ లో చర్చనీయాంశం అయ్యాయి. విజయసాయికి సంబధించిన ఎలాంటి విషయాలు రాధాకృష్ణ బయట పెడుతాడు..? ఆయనకు తెలిసిన విజయసాయి లీలలు ఏమై ఉంటాయా అని వైసీపీ నేతలే గుసగుసలాడుతున్నారు. జగన్‌కి విశ్వాసపాత్రుడినని ఎప్పటికప్పుడు నిరూపించుకునేందుకు విజయసాయిరెడ్డి ప్రయత్నిస్తూనే ఉంటారని, పైగా జగన్ తో సహా అనేక కేసుల్లో ఏ2 గా వున్నాడు విజయసాయి రెడ్డి.
అలాంటి వ్యక్తి కి సంబధించి ఏ లీలలు రాధాకృష్ణ కు తెలుసు అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. తాడేపల్లి అంతఃపురం రహస్యాలే బయటపెట్టిన రాధాకృష్ణ కు విజయసాయి రహస్యాలు బయటపెట్టటం పెద్ద విషయమేమి కాదని కొందరు అంటున్న మాటలు. చూద్దాం మరి కలలు వర్సెస్ లీలల విషయం ఎంత వరకు వెళ్తుందో