Nityananda: కైలాసలో శివుని దర్శనం చూపిస్తామంటున్న నిత్యానంద!!

Nityananda: నిత్యానంద భారత్‌లో బాగా పాపులర్ అవుతున్నప్పుడు ఆయన నిర్వహించే ఏ సమావేశమైనా భక్తులు తరలివచ్చేవారు. ఈనేపథ్యంలో గుజరాత్ కి చెందిన ఓ వ్యక్తి పోలీసులకు స్వామీజీపై కిడ్నాప్ కేస్ పెట్టారు. తన కుమార్తెలను కిడ్నాప్ చేశారని ఆరోపించడంతో.. నిత్యానందపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల నుండి తప్పించుకోవడానికి ఫేక్ పాస్ పోర్ట్ తో ఈక్వెడార్ వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఓ ద్వీపాన్ని కొని దానికి కైలాస అని పేరు పెట్టారు. ఇంకేం ఆ ద్వీపాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించి, హిందూ దేశంగా నిర్మించారు.

Nityananada Magics In His Own Country Kailash
Nityananada Magics In His Own Country Kailash

ఎంతోమంది వ్యాపారవేత్తలు, సాధారణ జీవితాన్ని పక్కనపెట్టి కైలాస కు వెళ్ళిపోవాలనుకున్నారు. అయితే ఎక్కడుందో తెలీని దేశంలోకి వెళ్ళడమంటే మాటలు కాదు. అక్కడ కేబినెట్ సెలెక్ట్ చేసిన వారే రాగలరు. అలా నిత్యానందకు భారీగా విరాళాలు ఇచ్చినవారు మాత్రమే రాగలరు. సనాతన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడమే ఈ దేశ ధ్యేయం.

ఈ నేపథ్యంలోనే కైలాస్ కు ప్రత్యేకంగా జెండా, జాతీయ జంతువు, పక్షి, పువ్వు, చెట్టు ఇలా అన్నీ ఉన్నాయి. దీనికి తోడు కైలాసకు అధికారిక వెబ్ సైట్ కూడా ఉంది. ఇది సరిహద్దులు లేని దేశంగా ప్రకటించారు. తమ దేశానికి స్పెషల్ గా బంగారు నాణేలను రిలీజ్ చేశారు. ప్రపంచమంతా తన దేశ కరెన్సీని అంగీకరిస్తుందని అన్నారు. కైలాసను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిని నిత్యానంద కోరారట.

ఈ క్రమంలో కైలాసకు వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకున్నవారు తమ దేశంలో మూడు రోజులు మాత్రమే ఉంటారని అంటున్నారు. ఈ మూడు రోజుల్లోనే పరమ శివుడ్ని చూపిస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. అయితే కైలాసకు భారతీయులు రాకుడదని నిషేదం విధించారు.

కరోనాతో అల్లాడుతున్న భారత్ నుండి ఎవరూ రావడానికి వీల్లేదని ప్రకటించారు. అయితే భారతదేశంలో కరోనా ఎప్పుడు తగ్గుతుందనే ఓ భక్తుడు అడిగిన ప్రశ్నకు నిత్యానంద, భారత్ లోకి అడుగు పెడితేనే కరోనా అంతమవుతుందంటూ బదులిచ్చారు. ఈ సమాధానంపై నెటిజన్లు సోషల్ మీడియాలో రకరకాల ప్రశ్నలు, కామెంట్లు వెలువడుతున్నాయి.