Eknath Shinde : మహారాష్ట్ర రాజకీయాలు తీవ్ర ఉత్కంఠకు దారితీస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఏక్‌నాథ్ షిండే వ్యవహారం శివసేనను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రెండు రోజులు గడిచిపోయినప్పటికీ.. ఈ విషయంపై ఓ స్పష్టత రావడం లేదు. ఈ నేపథ్యంలోనే ఏక్‌నాథ్ షిండేకు సీఎం పదవిని కట్టబెట్టి, పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ఏం జరగనుంది?
సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికార నివాసాన్ని ఖాళీచేయగా, తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే మరింత బలం సమకూర్చుకుంటున్నారు. అసమ్మతి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా షిండే చెంతకు చేరుతున్నారు. బుధవారం ఉదయం వరకు స్వంతంత్రులతో కలిపి 40 మంది ఎమ్మెల్యేలు షిండే పక్షం ఉండగా, తాజాగా మరో నలుగురు అసమ్మతి శిభిరంలో చేరారు. దీంతో షిండే మద్దతుదారుల సంఖ్య 46కు చేరింది. నలుగురు ఎమ్మేల్యేలు సూరత్ నుంచి గువాహటి చేరుకున్నారు. ఈ క్రమంలో షిండేని సీఎం చేయాలనే చర్చలు నడుస్తున్నట్టు తెలుస్తుంది.

మహా వికాస్ అఘాడీలోని పార్టీల మధ్య బుధవారం చర్చలు జరిగాయి. ఇందులో ఎన్సీపీ అధినేత శరద్ యాదవ్ సైతం పాల్గొన్నారు. ఏక్‌నాథ్ షిండేను సీఎం చేయాలని అందరు భావించినట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర సంక్షోభానికి ఇదొక్కటే పరిష్కారమని వారందరు అనుకుంటున్నట్టు తెలుస్తోంది.
శివసేనలో ప్రారంభమైన ముసలంతో మహావికాస్ అఘాడీ ప్రభుత్వం పతనంవైపు పయణిస్తున్నది. ఎమ్మెల్యేలు కోరికతో తాను సీఎం పదవికి, పార్టీ అధ్యక్ష స్థానం నుంచి తప్పుకుంటానని ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. బుధవారం రాత్రి అధికారిక నివాసం ‘వర్షా’ బంగ్లాను ఖాళీ చేసిన ఉద్ధవ్.. కుటుంబసభ్యులతో కలిసి బాంద్రాలోని సొంత నివాసం మాతోశ్రీకి చేరుకున్నారు.