Nara Lokesh : లోకేష్ పాదయాత్ర సాఫీగా సాగేనా?
NQ Staff - January 19, 2023 / 08:53 PM IST

Nara Lokesh : తెలుగు దేశం పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకు వచ్చేందుకు గాను నారా లోకేష్ ఏకంగా నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్రను 400 రోజుల పాటు చేయబోతున్నాడు. ఈనెల 27 నుండి ప్రారంభం కాబోతున్న ఈ పాదయాత్రకు పార్టీ సర్వం సిద్దం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కేడర్ ఎప్పుడెప్పుడు నారా లోకేష్ పాద యాత్ర ప్రారంభం అవుతుందా అంటూ ఎదురు చూస్తున్నారు.
మరో వైపు వైకాపా ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త జీవోతో పాద యాత్ర సాగేది ఎలా అంటూ టీడీపీ నేతలు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ సభలకు తప్ప రోడ్ షో లకు మరియు వీధుల్లో యాత్రలకు కొత్త జీవో లో అనుమతి లేదు. కనుక లోకేష్ పాదయాత్ర సాగేది ఎలా అంటూ కొందరు నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి గతంలో పాద యాత్ర చేసి అధికారంలోకి వచ్చిన విషయం తెల్సిందే. ఇప్పుడు తెలుగు దేశం పార్టీ నేత లోకేష్ పాదయాత్ర చేసేందుకు మాత్రం అనుమతి ఇవ్వడం లేదు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర కోసం లోకేష్ టీమ్ హై కోర్టు నుండి అనుమతులు తెచ్చుకునే అవకాశం ఉంది. కోర్టు అనుమతి ఇచ్చినా కూడా స్థానికంగా ప్రభుత్వంకు చెందిన అధికారులు మరియు వైకాపా నాయకులు లోకేష్ యొక్క పాదయాత్రను సాఫీగా సాగనిస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
లోకేష్ పాదయాత్ర కు స్పందన ఎలా వస్తుంది అనేది టీడీపీ వర్గాల్లో ఆసక్తి రేకెత్తుతోంది. ఈ సమయంలోనే నారా లోకేష్ యొక్క యువగళం పాదయాత్రలో నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ పలువురు పాల్గొనబోతున్నారు అనే ప్రచారం జరుగుతోంది.
ఎన్టీఆర్ కూడా పాదయాత్రలో భాగంగా లోకేష్ కు మద్దతుగా కొంత దూరం నడిచే అవకాశాలు ఉన్నాయట. అదే జరిగితే కచ్చితంగా లోకేష్ యువగళం సూపర్ హిట్ అవ్వబోతుందని టీడీపీ కార్యకర్తలు నమ్మకంతో ఉన్నారు. కానీ వైకాపా నుండి ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.