గ్రేటర్ ఎలక్షన్ మొత్తం మీద ‘ ముషీరాబాద్ ‘ సూపర్ స్పెషల్ – ఎందుకంటే !
PBN - November 28, 2020 / 09:43 AM IST

గ్రేటర్ ఎన్నికల విషయంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ అలసత్వం ప్రదర్శించకుండా తమ శక్తియుక్తులను కూడకట్టుకొని ముందుకు వెళ్తున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు హైదరాబాద్ లోని ప్రతి డివిజన్స్ లో ఒక్కో కీలక నేతను నియమించి ఆ డివిజన్ బాధ్యతలు వాళ్ళకి అప్పగించి ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో గ్రేటర్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో అభ్యర్థుల మధ్య పోరు రసవత్తరంగా మారింది. ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్, బీజేపీ ప్రధాన పార్టీలు. వీరిమధ్యే పోటీ ఎక్కువగా ఉంది.
ఈ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో అధికార పార్టీ టీఆర్ఎస్ కీలక నేతలను ఇన్‌చార్జ్‌లుగా నియమించింది. సీఎం కేసీఆర్ కూతరు కవితను గాంధీనగర్ ఇన్‌చార్జిగా నియమించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను అడిక్‌మెట్ ఇన్‌చార్జిగా, రాంనగర్ ఇన్‌చార్జిగా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డిని, అలంపూర్ ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్‌ను ముషీరాబాద్ ఇన్‌చార్జిగా, కవాడిగూడ ఇన్‌చార్జిగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని, భోలక్‌పూర్ ఇన్‌చార్జిగా టీఆర్‌ఎస్‌కేవీ అధ్యక్షుడు జి. రాంబాబు యాదవ్‌ను నియమించారు. ఇక్కడ ఎంఐఎం పార్టీ గట్టి పోటీ ఇస్తుంది. టీడీపీ, కాంగ్రెస్ ఉనికిని కాపాడుకోవటానికి పోటీచేస్తున్నాయి. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఐదు డివిజన్లు గెలుచుకుంది. మరో డివిజన్‌లో ఎంఐఎం గెలిచింది.
ముఖ్యంగా ఈ నియోజకవర్గంలోని గాంధీ నగర్ డివిజన్ మీద అందరి దృష్టి పడింది. ఎందుకంటే సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ఇక్కడ ఇంచార్జి గా వ్యవహరిస్తోంది, ఈ డివిజన్ నుంచి టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే ముఠా గోపాల్ మరదలు, ప్రస్తుత కార్పొరేటర్ ముఠా పద్మానరేష్ పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా బీజేవైఎం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎ.వినయ్‌కుమార్ సతీమణి ఎ.పావని పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున గుర్రం చంద్రకళ బరిలోకి దిగారు.
అడిక్‌మెట్ డివిజన్, రాంనగర్ డివిజన్,ముషీరాబాద్ డివిజన్,కవాడిగూడ డివిజన్ ,భోలక్‌ఫూర్ డివిజన్స్ లో కూడా గట్టి పోటీ జరగబోతుంది. ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలో ఆరు డివిజన్స్ లో నాలుగు డివిజన్స్ లు మహిళలకు రిజర్వేషన్ కావటంతో ఇక్కడ ఎమ్మెల్సీ కవిత ప్రభావం గట్టిగా ఉండే అవకాశం లేకపోలేదు. కేవలం గాంధీ నగర్ డివిజన్ లో మాత్రమే కాకుండా మొత్తం 6 డివిజన్స్ లో కవిత తన ప్రభావం చూపించాలని పనిచేస్తుంది.