KTR: ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారిని త‌న కారులో ఆసుప‌త్రికి త‌ర‌లించిన కేటీఆర్

KTR: తెలంగాణ మంత్రి, కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ సామాజిక సేవ‌లో ఎప్పుడు ముందుంటార‌నే సంగ‌తి తెలిసిందే. ఆయ‌న చేస్తున్న ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు ప్ర‌జ‌ల‌లో ఆయ‌న‌కి మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయి. డైన‌మిక్ లీడ‌ర్‌గా ప్ర‌జ‌లు ఆయ‌న‌ని కీర్తిస్తున్నారు. సోష‌ల్ మీడియాలో కొంద‌రు త‌మ‌కు సాయం చేయాల‌ని అభ్య‌ర్దిస్తుండ‌గా, వారికి తన‌దైన శైలిలో స్పందిస్తుంటారు కేటీఆర్. రియ‌ల్ హీరో గా కీర్తింప‌బ‌డుతున్న సోనూసూద్‌… కేటీఆర్‌ని రియ‌ల్ హీరో అని కామెంట్ చేయ‌డం గ‌మ‌న‌ర్హం.

KTR

ఎన్నో మంచి ప‌నుల‌తో అందరి మ‌న‌సులు గెలుచుకుంటున్న కేటీఆర్ తాజాగా పెద్ద మ‌న‌సు చాటుకున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన వారిని వెంటనే తన కాన్వాయ్‌లో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన సిద్దిపేట ఔటర్ బైపాస్ వద్ద జరిగింది. మెడికల్ కాలేజీ దగ్గరలో బైక్ ఆక్సిడెంట్ జరిగింది. బైక్ పై వెళ్తూ ప్రమాదవశాత్తూ డివైడర్ కి ఢీకొట్టిన సిద్దిపేట కాళ్ళకుంట కాలనీకి చెందిన ఇద్దరు ముస్లిం వ్యక్తులు కింద పడ్డారు.అయితే అదే సమయంలో అటువైపు నుంచి మంత్రి కేటీఆర్ కాన్వాయ్ వెళుతుంది.

గాయ‌ప‌డ్డ వారిని కేటీఆర్ త‌న కాన్వాయ్‌లో ఎక్కించుకొని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. సిద్దిపేట పట్టణం కాళ్లకుంట కాలనీకి చెందిన జాఫర్‌ (26), యాకూబ్‌ (30) ద్విచక్ర వాహనంపై పట్టణం వైపు వస్తుండ‌గా, ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది. క్షతగాత్రులిద్దరినీ సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఫోన్‌చేసి చెప్పారు కేటీఆర్. ఆపదలో స్పందించిన కేటీఆర్ కి అక్కడే ఉన్న ఇతర వాహనదారులు, గాయపడ్డ వారి బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.

సిరిసిల్ల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన కేటీఆర్ .. టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన సిరిసిల్ల నియోజకవర్గ యువ నాయకుడు దినేష్ రెడ్డి కరెంట్‌ షాక్‌తో మృతి చెంద‌గా, ఆయ‌న కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. కేటీఆర్ మీద అభిమానంతో త‌న కుమారుడికి తార‌క్ రామ్ రెడ్డి అని పేరు పెట్టుకోగా, ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.‘దినేశ్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించా. ఆయన తన కుమారుడికి తారకరామ్‌రెడ్డి అని పేరు పెట్టుకున్నారు. అది నా మనసుకు తాకింది. నా పేరు పెట్టుకున్న ఆ బాలుడికి అంతా మంచే జరగాలి. ఆ కుటుంబానికి అండగా ఉంటా’ అని పేర్కొన్నారు.